Tuesday 2 January 2018

యాత్రికుని ప్రయాణం



'యాత్రికుని ప్రయాణం' అనే క్రైస్తవ నవలను జాన్ బన్యన్  రచించాడు. ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని మార్గంలో నడిచే విధానాన్ని అనేక రూపకాల ద్వారా ఈ పుస్తకంలో వివరించాడు. ఇది పాఠకులచే ఎంతో ఆదరించబడింది.బైబిల్ తరువాత దాదాపు  200 భాషలలో ముద్రింపబడి రెండవ అతి పెద్ద పాఠక ఆదరణ పొందిన పుస్తకంగా చెప్పుటలో అతిశయోక్తి లేదు.'యాత్రికుని ప్రయాణం' ఇంగ్లీషు సాహిత్యంలోనే మొట్ట మొదటి నవల.సాహిత్య కోణంలోకంటే   ఈ పుస్తకం విశ్వాసి క్రైస్తవ జీవితాన్ని సువార్త  సత్యం పట్ల మేల్కొలుపును మరియు పరలోక పట్టణానికి చేరాలనే ఉత్సుకతను విశదీకరిస్తుంది. 

1. క్రైస్తవుని కష్టాలు

లోకమనే అరణ్యంలో నడిచి వెళుతున్నాను
చీకటి గుహలోనిద్రించాను
ఆ నిద్రలో నేనొక కలగన్నాను
కలలో ఒక వ్యక్తిని చూశాను
ఆ వ్యక్తి మీద వుంది గొప్ప బరువు
అతని చేతిలో వుంది తెరిచిన పుస్తకం
ఉద్వేగంతో రోదిస్తున్నాడు అతడు
"నేనేమి చేయాలి?" అని కేకలువేస్తున్నాడు
ఇంటిలోని వారికి అర్థం కాలేదు అతని కేకలు
పిచ్చివాడని పట్టించుకోవడం మానేశారు బంధువులు

                                                         
"రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి?"
అరుచుకుంటూ పరుగెడుతున్నాడు
ఎటుపోవాలో అర్థం కాక
అక్కడే నిలబడ్డాడు క్రైస్తవుడు

ఆ స్థలం నాశనపురం




సువార్తికునితో పరిచయం
ఇంతలో నా వైపుకు ఒక వ్యక్తి వచ్చాడు
తన పేరు సువార్తికుడు అని పరిచయం చేసుకున్నాడు
ఎందుకు నీవింతగా కలవరపడుతున్నావు?
దేని విషయమై చింత పడుతున్నావు? అని అడిగాడు నన్ను...
అయ్యా, నేను చదివాను ఈ పుస్తకం
మరణశిక్ష విధించబడింది నాకు అని తెలుసుకున్నాను
ఆ తరువాత తీర్పు కూడా వుందని తెలిసింది
అని నేను అతనితో చెప్పాను
ఈ పరిస్థితిలో ఇక్కడ వుండడం ఎందుకు?
రాబోతున్న ఉగ్రతను తప్పించుకు పారిపో
ఆ దూరంగా కనిపిస్తున్న ద్వారం దగ్గరకు పో
                           అన్నాడు సువార్తికుడు
నాకు ద్వారం కనిపించడం లేదు కాని
                                           మిణుకు మిణుకుమనే నక్షత్రం మాత్రం కనిపిస్తున్నది అన్నాను
                 నీ దృష్టిని ఆ వెలుగు మీదనే కేంద్రీకరించు
    ఆ ద్వారం నీవు చేరుకుంటావు
తలుపు తట్టు, నీవు ఏమి చేయాలో
అక్కడ నీవు ఏమి చెయాలో తెలుసుకుంటావు
అంటూ మార్గం చూపాడు నాకు

నాశనపురాన్ని వదిలిన  క్రైస్తవుడు

క్రైస్తవుడు ఇంటి నుండి పరిగెత్తడం ప్రారంభించాడు
అతని కుటుంబం అంతా ఏడుస్తూ ఇంటికి తిరిగి రమ్మని ప్రాధేయపడ్డారు
తన చెవులను వేళ్ళతో మూసుకొని 
"జీవం! జీవం! నిత్యజీవం!"  అంటూ పరిగెత్తసాగాడు క్రైస్తవుడు 
ఇరుగు పొరుగు అంతా చూడసాగారు  
ఎగతాళి చేశారు కొందరు 
బెదిరించేవారు, తిరిగిరమ్మనే వారు మరికొందరు
ఇద్దరు మాత్రం అతనితో వెళ్ళి ఎలాగైనా 
అతని మనసు మళ్ళించాలని అతనితో బయలుదేరారు

క్రైస్తవుడు మొండి,మెత్తన లతో కలిసి ప్రయాణం




క్రైస్తవుని తో తాము కూడా బయలుదేరారు మొండి,మెత్తనలు
ఎలాగైనా అతని మనసు మార్చి తిరిగి నాశనపురానికి తేవాలని
వారికి తన వద్దనున్న గ్రంధంలోనుండి విషయాలను వివరించాడు క్రైస్తవుడు 
మొండికి క్రైస్తవుడు ఒక మూర్ఖునిలా  అగుపించాడు
తన యాత్రను ముగించి ఇంటిదారి పట్టాడు

మెత్తనకు పరలోకాన్ని గురించి వివరించాడు క్రైస్తవుడు
ఆనందంగా వింటున్న మెత్తన  అనుకోకుండా బురదగుంటలో పడ్డాడు
అతనికి సహాయం చేస్తూ తాను కూడా అందులో పడ్డాడు క్రైస్తవుడు
ఈ బురదగుంటలో నుండి బయటపడే మార్గం చెప్పమని మెత్తన బతిమాలాడు
తనకు కూడా బయటపడే మార్గం తెలియదని చెప్పిన క్రైస్తవునిపై కోపగించుకొని
అతికష్టంతో అక్కడి నుండి తప్పించుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు మెత్తన 



బురదగుంటలో  క్రైస్తవుడు
   

            ఒంటరిగా బురదగుంటలో  మిగిలిపోయాడు క్రైస్తవుడు
           తన శక్తిని,నైపుణ్యాన్ని వుపయోగించాలని ప్రయత్నం చేశాడు
తన వీపు పైన భారం వల్ల గుంటలోనికి మరింత కూరుకుపోసాగాడు
ఇంతలో అటువైపు ఒక వ్యక్తి  వచ్చాడు, అతని పేరు సహాయం
అతడు క్రైస్తవునితో ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు? అని అడిగాడు
ఆ ద్వారం దగ్గరకు వెళ్ళమని సువార్తికుడు చెప్పగా బయలుదేరాను
కాని అనుకోకుండా ఈ బురదగుంటలో పడిపోయాను అని బదులిచ్చాడు
క్రైస్తవుడా, నువ్వు మెట్ల కోసం ఎందుకు వెతకలేదు? అంటూ
"నీ చెయ్యి ఇలా ఇవ్వు" అని క్రైస్తవునికి తన చేయి అందించి
పైకి లాగి  గట్టి నేల మీద నిలబెట్టాడు సహాయకుడు



                             
                        నిరాశాపూరిత రొంపిలో తప్పని ప్రయాణం                  
                                                   
                              అదిగో ఆ చిన్న ద్వారం కనిపిస్తుంది కదా , అటే వెళ్ళు అన్నాడు సహాయకుడు 
క్రైస్తవుడు అతనితో, అయ్యా నాశనపురం నుండి ఆ ద్వారానికి చేరే మార్గం ఇదే కదా , యాత్రికులంతా ఉపయోగించే ఈ మార్గాన్ని ఎందుకు సరిచేయరు? అని అడిగాడుఅందుకు సహాయకుడు  - ఈ ప్రదేశాన్ని నిరాశాపూరిత  రొంపి అంటారు.ఇది బాగుచేయగలిగినది కాదు, ఇది లోతట్టు ప్రాంతం ,ఇక్కడకు పాపపు ఒప్పుకోలు ద్వారా వచ్చిన మురుకి అంతా వచ్చి చేరుతుంది.పరిశుద్ధాత్మ చేత పాపులు కడగబడినప్పటికీ వారి మునుపటి నీచ స్థితిని చూచినపుడు ఎన్నో సందేహాలు, భయాలు, నిరాశా నిస్పృహలు , ఆందోళనలు వచ్చి ఇక్కడ స్థిర పడతాయి
వాటి కారణంగానే ఈ బురదగుంట ఏర్పడింది 
ప్రభువు ఆదేశాల మేరకే ఈ చిత్తడి ఏర్పడింది. 
కాని ఇది దాటడానికి గట్టి మెట్లు కూడా వేయబడినాయి
ఇక్కడకు వచ్చేసరికి  మెట్లు కనిపించనంతగా తల తిరిగి
 ప్రయాణీకులు బురదగుంటలో జారి పడతారు
ఏది ఏమైనా ఆ చిన్న ద్వారానికి అవతల ఉన్న నేల
 గట్టిగా వుంటుంది ...అని వివరించాడు  సహాయకుడు 

ఇంటికి చేరిన మెత్తన
మెత్తన తన  ఇంటికి చేరుకున్నాడు
అతనిని చూడటానికి ఇరుగు పొరుగు వారు వచ్చారు
జ్ఞానవంతుడివి కాబట్టే తిరిగి వచ్చేశావని అన్నారు కొందరు
మరికొందరు నీకు బుద్ధిలేదు కాబట్టే క్రైస్తవునితో  వెళ్ళావని మందలించారు
కొందరు అతని పిరికితనాన్ని  చూసి అవహేళన చేశారు
మెత్తన అవమానభారంతో తలదించుకున్నాడు
చివరికి ధైర్యం తెచ్చుకొని తన చుట్టూ వున్నవారితో మాట్లాడాడు
తన కోపాన్ని క్రైస్తవునిపైకి మళ్ళించి ,
తనను ఈ స్థితికి తెచ్చిన అతనిని దూషించాడు

 

క్రైస్తవునికి లోకజ్ఞాని సలహాలు
 క్రైస్తవుడు ఒంటరిగా నడుస్తున్నాడు.దారిలో ఎదురువచ్చాడు లోకజ్ఞాని.
అతడు ఇహలోకధర్మం అనే ఊరివాడు.క్రైస్తవుడు అదృశ్యమైన దేశాన్నిఅన్వేషిస్తున్నాడని విన్నాడు లోకజ్ఞాని.
 క్రైస్తవునితో సంభాషించాడు లోకజ్ఞాని -
క్రైస్తవునిపై వున్న మూట అనే బరువును విసిరి పారేయమని సలహా ఇచ్చాడు
సువార్తికుని సలహా విని నిరాశాపూరిత రొంపిలోనికి దిగబడ్డావని విచారించాడు
                          ఈ దారిలో వెళ్తే ఇంకా ఆకలి, ఆపదలు, అపాయాలు, మరణం సహా అన్నిఎదురవుతాయని   చెప్పాడు. నీ చేతిలో వున్న పుస్తకం ద్వారానే నీకు అనవసరమైన విషయాలు  తెలుస్తున్నాయని మందలించాడు


సీనాయి పర్వతం వద్ద క్రైస్తవుడు 
చట్టబద్దత ఇంటికి వెళ్ళేదారిలో వున్న
కొండను చేరాడు క్రైస్తవుడు
అది ఎంతో ఎత్తుగా వుండి,కొండ చెరియలు
తన మీద పడతాయేమోనని భయపడ్డాడు
అతనికి తన మీద వున్న భారం
మునుపటికంటే అధికమైనట్లుగా తోచింది
ఇంతలో ఆ కొండలో నుండి వచ్చిన మెరుపులకు 
అతనికి భయంతో ముచ్చెమటలు పట్టాయి
లోకజ్ఞాని సలహా విని అక్కడకు 
                      వచ్చినందుకు విచారించాడు క్రైస్తవుడు 

సువార్తికుని మరలా కలుసుకున్న క్రైస్తవుడు
క్రైస్తవునికి సువార్తికుడు మరలా ఎదురుపడ్డాడు
అతనిని చూసిన క్రైస్తవుడు ఎంతో సిగ్గుపడ్డాడు
సువార్తికుడు క్రైస్తవుని వైపు తీక్షణంగా చూస్తూ 
క్రైస్తవుడా ఏమి చేస్తున్నావు ఇక్కడ?
చిన్న ద్వారం వైపు మాత్రమే వెళ్ళమని చెప్పాను గదా,
ఇటువైపు ఎందుకు వచ్చావు? అని గద్దించాడు
అవును సువార్తికుడా,  నేను వేరొక వ్యక్తి 
చెప్పిన మాటలు విని ఈ వైపుకు వచ్చాను 
ఇక్కడకు వచ్చాక ఇది ఎంత అపాయకరమో 
నాకు తెలిసింది అన్నాడు క్రైస్తవుడు


సువార్తికుని హెచ్చరికలు – క్రైస్తవుని స్పందన
సువార్తికుడు అతనికి దేవుని వాక్యం అందించాడు
నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించాలని
సర్వోన్నతుని ఆలోచనలు పెడచెవినబెట్టి
కోరి కష్టాలు తెచ్చుకున్నావని హెచ్చరించాడు
అయ్యో ,నాకు శ్రమ నేను నశించిపోయాను
అని క్రైస్తవుడు అతని పాదాల మీదపడి రోదించాడు
సువార్తికుడు అతనిని లేపి , దగ్గరకు తీసుకొని
క్రైస్తవుడు చేసిన తప్పును వివరించి
మంచి మార్గంలో వెళ్ళుటకు నడిపించాడు 


మంచి మార్గంలో క్రైస్తవుడు



క్రైస్తవుడు మంచి మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు
ఎట్టకేలకు చేరుకున్నాడు చిన్న ద్వారం
ఆ ద్వారం మీద “తట్టుడి ,మీకు తీయబడును “ అని వ్రాయబడి వుంది
ఆ ద్వారం తలుపును అనేకమార్లు తట్టాడు క్రైస్తవుడు
లోపలికి అనుమతిస్తే దేవునిని ఎన్నడూ స్తుతించుట మానను
అంటూ కేకలు వేయసాగాడు
అతని కేకలు విని అనుగ్రహకారి అనే వ్యక్తి ద్వారం వద్దకు వచ్చాడు
అతడు ఒక్క ఉదుటున క్రైస్తవుని లోనికి లాగాడు
అతని చర్యకు విస్తుపోయాడు క్రైస్తవుడు
ఈ ద్వారానికి దగ్గరలోనే బయల్జేబూబు మరియు
అతని మనుష్యులు నివసించే కోట వుందని
ఈ ద్వారం వద్దకు చేరుకోడానికి ప్రయత్నించే ప్రయాణీకులను
గాయపరచడానికి లేదా నివారించడానికి

వారు బాణాలు వేస్తారని వివరించాడు అనుగ్రహకారి 




అనుగ్రహకారితో క్రైస్తవుడు 
ఇక్కడకు వచ్చి తలుపుతట్టమని  నేను చేయవలసిన వాటిని ఇక్కడ తెలియజేస్తారని
సువార్తికుడు నాతో చెప్పాడు అన్నాడు క్రైస్తవుడు ......
తాను ఎలా నాశనపురం నుండి బయటపడింది, నిరాశా రొంపి వరకు
 మొండి మరియు మెత్తనలతో కలిసి ప్రయాణం మొదలగు వాటిని
అనుగ్రహకారికి వివరించాడు క్రైస్తవుడు!
మెత్తన తిరిగి వెళ్లి పోయినందులకు విచారించాడు అనుగ్రహకారి
దివ్య నగరం చేరడానికి కొద్దిపాటి కష్టాల విలువ తెలిసుకోలేకపోయాడు మెత్తన
క్రైస్తవునికి ఎదురైన మోసగాళ్ళ గురించి , సీనాయి కొండ నుండి తప్పించుకోవడం
గురించి తెలుసుకున్న అనుగ్రహకారి  క్రైస్తవునితో
యాత్రికుడా, నాతో రా ...నీవు వెళ్ళవలసిన మార్గం చూపిస్తాను
అని దూరంగా వున్న ఇరుకు మార్గాన్ని చూపించాడు
ఆ మార్గంలోనే పితరులు, ప్రవక్తలు ,క్రీస్తు, అపోస్తులులు ప్రయాణించారు

ఆ మార్గం తిన్నని మార్గం 
వివరణ కర్త  ఇంటికి క్రైస్తవుడు
తన వీపు మీద భారం గురించి అనుగ్రహకారిని అడిగాడు క్రైస్తవుడు
నీవు విముక్తి అనే స్థలానికి చేరే వరకు ఈ భారం మోయడానికి ఇష్టపడు
అక్కడ దానంతట అదే జారి పడిపోతుంది అన్నాడు అనుగ్రహకారి
ఆ కనిపించే ద్వారం గుండా వెళితే , వివరణ కర్త ఇల్లు నీకు కనపడుతుంది
అక్కడ నీకు అతను విలువైన సమాచారం అందిస్తాడు
అని క్రైస్తవునితో  చెప్పాడు అనుగ్రహకారి
క్రైస్తవుడు అతనికి వీడ్కోలు పలికి
 తన దారిన ప్రయాణం కొనసాగించాడు
ఒక గంట తరువాత ఒక పెద్ద యింటి వద్దకు వచ్చాడు
అనేకమార్లు తలుపు తట్టిన తరువాత ,
“ఎవరక్కడ” అనే స్వరం లోపలి నుండి వినపడింది
తలుపు తెరచిన సేవకునితో తాను ఈ యింటి యజమానుని కలిసి
కొన్ని  ఆదేశాలను పొందాలని వచ్చిన యాత్రికుడని

తెలిపాడు క్రైస్తవుడు

క్రైస్తవునితో వివరణకర్త
ఇంతలో అక్కడికి వచ్చాడు ఆ యింటి యజమాని ఐన వివరణకర్త
క్రైస్తవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు
క్రైస్తవునితో ప్రయోజనకరమైన సంగతులను
తెలియజేస్తాను అని అతనిని లోనికి ఆహ్వానించాడు
ఆ తరువాత ఒక గది వద్దకు క్రైస్తవుని తీసుకెళ్ళాడు
అక్కడ ఒక గంభీరమైన చిత్రం కనబడింది
ఆ చిత్రంలో ఒక వ్యక్తి   శ్రేష్ఠమైన గ్రంధాలు చేతిలో పట్టుకొని
ఆకాశం వైపు తేరిచూస్తున్నాడు
అతని పెదవులపై సత్యము యొక్క వ్యక్తీకరణ వున్నది
అతని వెనుక లోకము వున్నది
అతడు మనుష్యులను బ్రతిమాలుచున్నట్లు
నిలబడివున్నాడు
అతని తలపైన ఒక బంగారు కిరీటం వుంది
ఈ చిత్రము యొక్క భావము వివరించమని
వివరణకర్తను కోరాడు క్రైస్తవుడు 
గదిలోని చిత్రపటము యొక్క భావము
చిత్రములోని వ్యక్తిని అతడు చేసేపనిని తెలియజేశాడు వివరణకర్త
చీకటి సంగతులను పాపులకు తెలియజేసే ఉపదేశకుడు అతడు
అతడు యజమాని సేవ పట్ల ప్రేమ కారణంగా
ప్రస్తుత సంగతులను తృణీకరించి అల్పమైనవిగా  ఎంచుకున్నాడు
రాబోయే లోకంలో మహిమకిరీటం
లభిస్తుందనే నిశ్చయత అతనికి వుంది
ఈ చిత్రపటంలో వున్న వ్యక్తి  నీకు ఎదురయ్యే కఠినమైన ప్రతిచోటా
నీకు మార్గదర్శిగా ఉండటానికి ప్రభువు అధికారం
పొందిన వ్యక్తి  ఇతనొక్కడే
అప్రమత్తంగా వుండి నీవు ఏమి చూశావో గుర్తుంచుకో
నిన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నట్లు నటించేవారు ఎదురవుతారు
వారి మార్గం మరణానికి దారి తీస్తుంది
అని చెప్పాడు వివరణకర్త

గదిలోని చిత్రపటము యొక్క భావము వివరణ
వివరణకర్త  క్రైస్తవునికి చిత్రపటము యొక్క భావమును వివరించాడు
ఆ పటము లోని వ్యక్తి ఉపదేశకుడు
ఆతని కన్నులు ఆకాశం వైపు ఎత్తబడి ఉండటం ,
అతని చేతిలోని శ్రేష్టమైన గ్రంథాలు -  సత్యమును గూర్చిన ధర్మశాస్త్రము
అతని పెదవిపై వ్రాయబడి యుండుట  అతడు చేసే పనిని  సూచిస్తున్నది
చీకటి సంగతులను తెలిసికొని పాపులకు తెలియజేయటమే అతని పని
అందుకే అతడు మనుష్యులను బ్రతిమాలుచూ నిలబడి ఉన్నాడు
అతని వీపు వెనుక లోకము , అతని తల పైన కిరీటం అనునవి
అతడు తన యజమాని సేవ పట్ల తనకు గల ప్రేమ కారణంగా
ప్రస్తుత సంగతులను తృణీకరించి , అల్పమైనవిగా ఎంచుతున్నాడు
రాబోయే కాలంలో మహిమ కిరీటం బహుమానంగా లభిస్తుందన్న
నిశ్చయతతో అతను ఉన్నాడు
నీవు వెళ్ళే దారిలో ఇతను నీకు కనబడి సహాయం చేస్తాడు


విశాలమైన చావిడిని పరిశుభ్రపరచుట
తర్వాత అతన్ని ఒక విశాలమైన చావిడి లోనికి తీసుకెళ్ళాడు
దాని నిండా దుమ్ము పేరుకొనివుంది
దానిని తుడిచేందుకు  వివరణకర్త ఒక మనిషిని పిలిచాడు
అతడు ఊడ్చటం ప్రారంభించేసరికి
  ఆ గది నిండా దుమ్ము అలుముకుంది
అందువల్ల క్రైస్తవునికి ఊపిరి ఆడలేదు
వివరణకర్త అక్కడ ఉన్న యువతికి
 “నీళ్ళు తెచ్చి గదిలో చల్లు” అని చెప్పాడు ,ఆమె అలాగే చేసింది
అప్పడు దుమ్ము అణిగిపోగా ఆ యువతి గదిని ఊడ్చింది
దాని భావాన్ని వివరించాడు వివరణకర్త
ఈ చావిడి సువార్త ద్వారా దేవుని చేత ఎన్నడూ
 పరిశుద్ధ పరచబడని మానవ హృదయం
మానవుణ్ణి అపవిత్రపరచిన పాపపు దుమ్ము
మొదట ఊడ్చుటకు ఆరంభించిన వ్యక్తి ధర్మశాస్త్రం
అతడు  దానిని శుభ్రం చేయలేకపోయాడు
సువార్త అనబడే నీరు చల్లినప్పుడు , పాపం అణచివేయబడి
క్రీస్తు విశ్వాసము చేత ఆత్మ శుద్ధీకరించబడుతుంది

గదిలోని చిన్నారులు
వివరణకర్త   క్రైస్తవుడిని చిన్న గది లోనికి తీసుకెళ్ళాడు
అక్కడ ఇద్దరు చిన్నారులు కూర్చొని వున్నారు.
పెద్దవాని పేరు ఆవేశం. చిన్నవాని పేరు సహనం.
ఆవేశం అసహనంగా వున్నాడు. కారణం అతడు తనకు రావలసిన
మేలైన వస్తువులన్నీ వెంటనే కావాలని అనుకుంటాడు.
సహనం వేచి ఉండటానికి ఇష్టపడతాడు.
ఒకడు ఆవేశం వద్దకు వచ్చి సంచీడు డబ్బును ఇవ్వగా
అతడు ఆనందంతో తీసుకున్నాడు. సహనాన్ని చూసి ఎగతాళి చేశాడు.
కాని త్వరలోనే తనకు వచ్చిన డబ్బంతా వ్యర్ధం చేశాడు.
ఆవేశం ఈ లోకస్తులకు సూచన. సహనం రాబోయే లోకానికి సూచన.
సహనం శ్రేష్ఠమైన వాటి కొరకు ఎదురు చూస్తాడు.

తన బహుమానాల వల్ల కలిగే మహిమను హాయిగా అనుభవిస్తాడు .
మనిషి హృదయంలో దేవుని కృపాకార్యం
వివరణకర్త  క్రైస్తవుడిని ఒక చోటకు తీసుకెళ్ళాడు
అక్కడ గోడ మీద మంటలు చెలరేగుతూ ఉన్నాయి
ఒకడు నిత్యమూ దాని మీద నీళ్ళు పోస్తూ  ఉన్నాడు
అయినా  ఆ మంటలు వేడిగా ఎగిసిపడుతూనే ఉన్నాయి
దాని ఉద్దేశ్యమేంటి ? అని అడిగాడు క్రైస్తవుడు
అందుకు వివరణకర్త ఇలా వివరించాడు
మనిషి హృదయంలో దేవుడు జరిగించే కృపాకార్యమే ఈ అగ్ని
దానిమీద నీళ్ళు పోస్తున్నవాడు అపవాది
అయినా ఆ మంటలు మండుతూనే ఉన్నాయి
వివరణకర్త క్రైస్తవుని గోడ ప్రక్కకు తీసుకెళ్ళాడు
అక్కడ రహస్యంగా ఒక  వ్యక్తి ఆగ్నికి ఆజ్యం పోస్తున్నాడు
ఆత్మలో దేవుని కృపాకార్యం ఎలా కొనసాగుతుందో  క్రైస్తవునికి అర్ధం అయ్యింది
లోకం జల్లే నీళ్ళను, అపవాది కలిగించే శోధననూ తట్టుకునేలా

 విశ్వాసి ఆత్మలో క్రీస్తు తన కృపను దయచేసే మార్గం ఇదే 

రాజ భవనం – పరలోక రాజ్యం 

వారిరువురు ఒక అందమైన ఉద్యానవనంలో
వైభవమైన రాజ భవనానికి చేరుకున్నారు
ఆ భవనం మీద బంగారపు వస్త్రాలు ధరించుకున్న
వ్యక్తులు అటూ ఇటూ నడుస్తున్నారు
ఆ ద్వారం వద్ద ప్రజలు గుంపులుగా నిలబడ్డారు
కాని లోపలికి వెళ్ళడానికి సాహసించడంలేదు
క్రైస్తవుడు ఒక విషయాన్ని  గ్రహించాడు
పరలోకరాజ్యానికి ప్రవేశించాలని చాలామంది ఆశిస్తారు
చాలామంది  ఇష్టపడతారు

కాని భయంతో వెనుకడుగేస్తారు........




Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews