Monday, 30 June 2025
Monday, 23 June 2025
బ్లెయిజ్ పాస్కల్ ప్రఖ్యాత శాస్త్రవేత్త (1623 – 1662)
అది 1654 వ సంవత్సరం, అక్టోబర్ మాసం. ఒక వ్యక్తి ప్రతీదినం లాగానే తన గుర్రపు బండిని తానే నడుపుకుంటూ తన ఊరి దగ్గరలోని నదిపై కట్టిన వంతెన మీదకు వెళ్ళాడు. కాని అనుకోకుండా గుర్రాలు రెండూ నది లోకి దూకాయి. ఈ సంఘటన లో దేవుని కృపను బట్టి బండి మాతం పిట్టగోడ వరకూ వచ్చి దానిపై ఆనుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. అతి కష్టం మీద స్ప్రహ లోనికి వచ్చాడు. దీనితో అతని నరాలు చిట్లి నిద్రలేని రాత్రులు గడిపేవాడు. ఆ సంఘటన అతని జీవితంలో పెనుమార్పులు తీసుకొని వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు బ్లెయిజ్ పాస్కల్.
బ్లెయిజ్ పాస్కల్ ప్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు, పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు , మత తాత్వికుడు మరియు వేదాంతి. 1654 వ సంవత్సరంలో జరిగిన ఒక దుర్ఘటన లో ఆయన దాదాపుగా ప్రాణాన్ని కోల్పోయే స్థితి నుండి పునర్జన్మను పొందడమే కాకుండా నూతన జన్మను కూడా పొందాడు. యేసు క్రీస్తు వ్యక్తిత్వం పై ఆయన సిద్ధాంతం ఆధారపడి ఉండేది. హేతువు ద్వారా కన్నా హృదయం ద్వారానే ఒకడు దేవుని అనుభవ పూర్వకంగా తెలుసుకోగలడని ఆయన నమ్మకం.
బాల్యం
పాస్కల్ ఫ్రాన్స్ దేశంలోని క్లెర్మాంట్- ఫెరాండ్ (Clermont – Ferrand) అనే స్థలంలో 1623 వ సంవత్సరంలో జన్మించాడు. అతని తల్లి ఆంటోనెట్ బెగాన్ (Antoinette Begon). అతనికి మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే ఆమె మరణించింది. అతని తండ్రి ఎటిన్ పాస్కల్ (Etiene Pascal) కూడా గణితశాస్త్రమంటే ఎంతో మక్కువ గలవాడు. ఆయన స్థానిక న్యాయస్థానంలో కూడా సభ్యుడిగా ఒక గౌరవనీయమైన స్థానం కలిగి ఉండేవాడు. పాస్కల్ కు ఇద్దరు సహోదరీలు గిల్మర్ట్ (Gilberte) మరియు జాక్విలిన్ (Jaquline). తన భార్య మరణించిన 5 సంవత్సరాల తరువాత ఎటిన్ పాస్కల్ కుటుంబంతో సహా పారిస్ నగరానికి వచ్చాడు. ఆయన తన పిల్లల పోషణ భారాన్ని తానె చూసుకోవాలనే తలంపుతో పునర్వివాహం చేసుకోలేదు. వారందరు చిన్నతనం నుండే బాలమేధావులు గా ఎంతో ప్రతిభను కనబర్చేవారు. ముఖ్యంగా బ్లెయిజ్ గణిత శాస్తం మరియు విజ్ఞాన శాస్త్రం లో అధికమైన అభిరుచిని కలిగియుండేవాడు.
పిల్లవాడిగా పాస్కల్ కు ప్రతీ విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. ఏదైనా ఒక అద్భుత విషయాన్ని చూస్తే నవ్వి , ఉదాసీనంగా ఉండేవాడు కాదు. అది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన కుమారుని మేధా పటిమను చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు. గణిత శాస్త్రం జోలికి పాస్కల్ ను వెళ్ళనీయకూడదని తలంచాడు. గణిత శాస్త్ర అధ్యయనం మనసును నిర్భందించి, వశపరచుకొని మిగతా వాటి మీద ధ్యాస లేకుండా చేస్తుందని ఆయన భయపడేవాడు. అందుకే లాటిన్ మరియు ఇతర భాషల లోని కఠిన మైన పాఠాలను నేర్చుకొనే ఏర్పాటు చేసి గణిత శాస్త్ర అధ్యయనానికి సమయం లేకుండా చేసేవాడు. కాని బ్లెయిజ్ యొక్క సహజసిద్దమైన కోరిక , జిజ్ఞాస వాటినన్నిటిని అధిగమించింది.
ఆవిష్కరణలు
పాస్కల్ తన 16 వ ఏటనే కోనిక్ సెక్షన్స్ ను రచించాడు. ఆర్కిమెడిస్ కాలం తరువాత గణిత శాస్త్రంలో జరిగిన విశిష్టమైన రచన ఇదే అని ఫ్రెంచ్ దేసస్తులంతా అతనిని కీర్తించారు. ఆ తరువాత అతడు కాలిక్యులేటింగ్ మెషీన్ కనుగొన్నాడు. మూడు సంవత్సరాలు పరిశోధన చేసి 50 నమూనా యంత్రాలను, పాస్కలైన్ కాలిక్యులేటర్స్ అని పిలువబడే 20 యంత్రాలను అతడు రూపొందించాడు.
పాస్కల్ తన మేధా పటిమతో వాయువుకు బరువు ఉంటుందని, మెర్క్యురీ లెవల్ వాతావరణానికి అనుగుణంగా మారుతుందని కనిపెట్టాడు. దీని ఫలితంగానే సెప్టెంబర్ 19, 1648 లో అతడు ‘బారోమీటర్’ ను ప్రపంచానికి అందించాడు. అప్పటికి పాస్కల్ వయస్సు 20 ఏళ్ళు. ఆ తరువాత అతడు ఎన్నో ప్రయోగాలు చేసి అనుదినం జీవితానికి అవసరమయ్యే అనేక క్రొత్త విషయాలను కనుగొన్నాడు.
మతం పై ఆసక్తి
1646 లో పాస్కల్ యొక్క తండ్రి జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. చికిత్స చేయుట కొరకు ఆ దేశంలో ప్రసిద్ధులైన ఇద్దరు వైద్యులు వారి గృహానికి వచ్చేవారు. వారిరువురు కాథలిక్ బోధలలో నిష్ణాతులు. వారితో తరచూ సంభాషిస్తూ బ్లెయిజ్ కూడా కాథలిక్ మతబోథల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఆయన అగస్టీన్ స్థాపించిన శాఖకు పరిచయమయ్యాడు. ఇది అతనిలో జరిగిన మొదటి మార్పుగా పాస్కల్ భావించేవాడు. ఆ తరువాత అతడు కొద్దికాలం పూర్తిగా ప్రక్కకు తొలిగి (1648 – 1654) మధ్యకాలంలో లోకానుసారమైన జీవితం జీవించాడు. 1651లో అతని తండ్రి మరణించాడు. ఒక సోదరి వివాహం చేసుకొని తన భర్తతో వేరొక ప్రదేశానికి వెళ్ళింది. తన చెల్లెలు జాక్విలిన్ఆస్తినంతా పాస్కల్ కు రాసి సన్యాసినిగా పోర్ట్ రాయల్ అనే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన పాస్కల్ ను ఎంతో కృంగదీసింది. అతడు పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. అతడు ఇహలోక వ్యాపారంలో చిక్కుకొని దేవునికి దూరమయ్యాడు.
పునర్జన్మ
1654 నవంబర్ 23 సోమవారం పాస్కల్ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. రాత్రి కాల సమయంలో 10.30 నుండి 12.30 గంటల మధ్య అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ రాత్రి నిద్రపట్టక బైబిల్ చదువుతూవుండగా అకస్మాత్తుగా ఒక అగ్ని జ్వాల తనను చుట్టివేయడం గమనించాడు. మిరుమిట్లు గొలిపే కాంతికి అతని కళ్ళు మసకబారి పోయాయి. ఆ అద్భుతమైన ఘడియ మాటలలో వివరించలేనిదని అంటాడు పాస్కల్. ఒక అనూహ్యమైన శక్తి అతనిని ఆవరించింది. అతనిలో ఒక వింత ప్రక్రియ ప్రారంభమయ్యి అతని అభిరుచులను ఇష్టాలను రూపుమాపి ఒక నూతన వ్యక్తిగా మార్చింది. దైవ కృప ఆయన హృదయం లోకి వచ్చి గొప్ప కార్యాన్ని చేసింది. తన సోదరి స్వార్ధ రహిత జీవితం కూడా అతడిని తన్మయుడిని చేసింది. అతడు కొంతకాలం తన వైజ్ఞానిక పరిశోధనలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు తనతో మాట్లాడిన ‘ అవసరమైన దానిని ‘ వెదకడం ప్రారంభించాడు. ఈ ఉన్నతమైన అన్వేషణకు తనను తాను అంకితం చేసుకున్నాడు.
పాస్కల్ తన పునర్జన్మ అనుభవాన్ని ఇతరులతో పంచుకునేందుకు అనువుగా వెంటనే ‘ ఆన్ ద కన్వర్షన్ ఆఫ్ ద విన్నర్’ అనే పుస్తకాన్ని రాసాడు . “ నా జనులు రెండు నేరములు చేసియున్నారు. తమ కొరకు జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి యున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్ళు నిలువని తొట్లను తొలిపించుకొని యున్నారు” (యిర్మియా 2:13) అనే వచనం ద్వారా దేవుడు తనతో మాట్లాడినట్లు పాస్కల్ తెలియజేసాడు. ఈ మాటలు పాస్కల్ మనస్సులో కలవరం లేపాయి. తానూ బుద్దిపూర్వకంగా ప్రభువు తట్టు తిరిగి నీళ్ళు నిలవని బద్దలైన తొట్లు అనగా కేవలం విజ్ఞాన జీవితంలోనే నిమగ్నమై పరలోకాన్నే మర్చిపోయే అల్పత్వంలో ఉన్నానని గుర్తించాడు. ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టిన యే జీవజీల ఊటనైతే (యేసును) ఇంతకాలం వదిలేశాడో ఆ విమోచకుడిని ఆశ్రయించాడు. ఆ దినం నుండి తానూ మరణించేవరకు యేసే సర్వస్వంగా బ్రతికాడు పాస్కల్.
పాస్కల్ రచనలు
1656- 57 మధ్యకాలంలో పాస్కల్ అనేక రచనలు చేసాడు. కాథలిక్ మత పద్ధతులను ఎన్నిటినో పాపపు ఆచారాలుగా కొట్టివేసాడు. అతడు రాసిన 18 ఉత్తరాల సంపుటి ‘ప్రొవిన్షియల్ లెటర్స్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. అతని రచనలు ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయితలైన వోల్టేర్,రూసో లను కూడా ప్రభావితం చేశాయి. క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందిచుటకు ‘పెన్సిస్’ అని పిలువబడే గ్రంథాన్ని పాస్కల్ రచించాడు . ఇది అతని మరణానంతరం ముద్రించబడింది. తన సహోదరిని తిరిగి రావలసినదిగా విజ్ఞాపన చేస్తూ ఆయన రాసిన రచనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
వైజ్ఞానిక సంబంధమైన అనేక పరిశోధనలతో కూడిన రచనలు చేశాడు పాస్కల్. ‘ఎస్సేస్ ఆన్ కోనిక్స్’ మరియు ‘న్యూ ఎక్స్పెరిమెంట్ విత్ ద వ్యాక్యుం’ మొదలగు గణిత శాస్త్రం మరియు పదార్ధ శాస్త్రాలకు సంబంధించిన అనేక ఆవిష్కరణలకు సంబంధించిన రచనలను చేశాడు పాస్కల్. 1662 లో పారిస్ నగరంలో యంత్రాలతో నడిచే మొట్ట మొదటి పబ్లిక్ బస్ లైన్ ను నడిపించి యాంత్రిక రంగంలో తనలోని మేధా పటిమను ప్రపంచానికి తెలియజేశాడు. అతని ఆవిష్కరణలతో నాగరిక ప్రపంచానికి బాటలు వేశాడు పాస్కల్
ముగింపు
1662 ఆగష్టు 19 న తీవ్ర అనారోగ్యానికి గురై తన 39 వ ఏట ప్రభువు సన్నిధికి చేరాడు పాస్కల్. తన అంతం దగ్గర పడుతున్నప్పుడు ‘నా కోసం శ్రమ పొంది చనిపోవడానికి వచ్చిన విమోచకుడి వైపు నా చేతులు చాపుతున్నాను’ అని పలికాడు. ‘ దేవుడు నన్నెన్నడు విడిచిపెట్టడు’ అన్న అతని చివరి పలుకులు అతని సమాధి మీద చెక్కబడ్డాయి. ఫ్రాన్స్ చరిత్రలో అనేక మంది గొప్ప వ్యక్తులు జన్మించారు కాని వారందరిలో విశిష్టమైన వ్యక్తిగా తన కాంతిని విశ్వమంతటా వెదజల్లాడు పాస్కల్.
Monday, 16 June 2025
Monday, 9 June 2025
Wednesday, 4 June 2025
క్రీస్తు సేవలో క్రికెట్ ఆటగాడు ఛార్లెస్.టి. స్టడ్
సి.టి. స్టడ్ గా పిలువబడే ఛార్లెస్ థామస్ స్టడ్ బ్రిటిష్ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు మరియు మిషనరీ. ఇతడు చైనా, ఇండియా మరియు ఆఫ్రికా దేశాలలో మిషనరీగా పరిచర్య చేశాడు. “ యేసు క్రీస్తు దేవుడై, నా పాపాల నిమిత్తం మరణించినట్లయితే, ఆయన కొరకు నేను చేసే ఏ త్యాగము గొప్పది కాదు” అనే నినాదంతో ఆయన తన క్రీడా జీవితాన్ని వదిలి క్రీస్తు కొరకై జీవించాడు.
స్టడ్ కుటుంబానికి క్రీస్తు పరిచయం
ఛార్లెస్ స్టడ్ యొక్క తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ నార్త్ ఇండియా లోని ‘టిర్ హట్’ అనే ప్రాంతంలో నీలిమందు (ఇండిగో) తోటలలో ఎంతో ధనాన్ని ఆర్జించి తన మాతృదేశమైన ఇంగ్లండ్ లోని ‘లిటిల్ షైర్’ అనే స్థలములో స్థిరపడ్డాడు. అక్కడ అతడు తన సమయాన్ని క్రికెట్ మరియు గుఱ్ఱపు పందెముల ఆటలతో గడిపేవాడు. ఆ దినాలలో డి.యల్.మూడీ మరియు శాంకీ అనే దైవజనులు ఇంగ్లండ్ లో సువార్తను ప్రకటించసాగారు. తన మిత్రుని కోర్కె పై ఆ సభలకు హాజరయిన ఎడ్వర్డ్ క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు. రక్షణ పొందిన తరువాత అతడు తన విలాస జీవితాన్ని విడచి తన ఇంటిలో ప్రార్థనలకై ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి అనేకులు దేవునిలోనికి వచ్చునట్లుగా ఎంతో కృషి చేశాడు.
క్రికెట్ ఆటగాడిగా స్టడ్
ఎడ్వర్డ్ స్టడ్ నకు న్యాస్టన్, జార్జ్, ఛార్లెస్ అను ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు ఈటన్ కళాశాలలో చదివేవారు. ఛార్లెస్ ఎక్కువగా ఆటపాటలతో కాలం గదుపుచూ రక్షణను నిర్లక్ష్యం చేశాడు. ఆదివారం మాత్రం భయభక్తులు ఉంటే చాలని భావించేవాడు. ప్రతిదినం ఎక్కువ సమయం క్రికెట్ ను ప్రాక్టీస్ చేయడంలో గడిపేవాడు. ‘బెస్ట్ క్రికెట్ ప్లేయర్’ గా తన కాలేజీలో పేరు తెచ్చుకున్నాడు. ఇతరులను కూడా క్రికెట్ ఆదేవిదంగా ప్రోత్సహించేవాడు. క్రికెట్ ఆట ద్వారా ధైర్యము, స్వార్థ త్యాగము, ఓరిమి మొదలైన సుగుణాలను అతడు అలవరచుకున్నాడు.
ఎడ్వర్డ్ స్టడ్ తన కుమారులు దేవుని తెలుసుకోవాలనే ఆసక్తితో వేసవిలో వారి కొరకై ప్రత్యేకంగా సువార్తికులను ఇంటికి ఆహ్వానించి, వారికి దేవుని వాక్యాన్ని భోధించుటకు ప్రయాసపడేవాడు. ఛార్లెస్ అనేకమార్లు సువార్తికులను హేళన చేస్తూ క్రికెట్ ఆటకై వెళ్ళిపోయేవాడు. ఒకనాడు ఒక సువార్తికుడు అతనిని నీవు క్రైస్తవుడవేనా ? అని ప్రశ్నించగా నేను చిన్నతనం నుండే క్రీస్తును విశ్వసిస్తున్నాను. క్రైస్తవ సంఘము పై నాకు విశ్వాసము కలదు అని బదులిచ్చాడు. అంతట ఆ దైవజనుడు యోహాను 3:16 లోని నిత్యజీవం గురించి ఛార్లెస్ కు వివరించాడు. ఆ దినము దేవుడు తనకు ఉచితముగా ఇచ్చిన నిత్యజీవాన్ని స్వీకరించి తన రక్షణ కొరకై కృతజ్ఞతతో దేవుని స్తుతించాడు. ఆ దినము నుండి తనకు బైబిల్ ఎంతో ప్రియమైనదిగా కనిపించిందని ఛార్లెస్ తన రక్షణానుభావము గురించి చెప్పేవాడు.
ఛార్లెస్ రక్షణ పొందిన తరువాత అతని సహోదరులిద్దరూ కూడ దేవుని తెలుసుకున్నారు. వీరు ముగ్గురు ఈటన్ కళాశాల లో చదువుచూ తమ తోటి విద్యార్ధుల కొరకై ప్రత్యేక సభలను ఏర్పాటు చేసి వారిని ప్రభువు లోనికి నడిపించాలని ప్రయాసపడేవారు.
పునరుజ్జీవము
స్టడ్ సోదరులు ముగ్గురు క్రికెట్ ఆటలో ప్రఖ్యాతి గడించారు. పేరు ప్రతిష్టలు పెరుగుతుండగా వారిలో ఆధ్యాత్మిక జీవితము చల్లారిపోయి క్రీస్తునందు ఉన్న మెదటి ప్రేమను వదిలేశారు. ఆ దినాలలో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ కు స్టడ్ సోదరులు పాల్గొనుటకు వెళ్లారు. అక్కడ ఉండగా జార్జి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన సోదరుని పడక వద్ద కూర్చున్న ఛార్లెస్ కు ఈ తలంపు వచ్చింది “ ఈ లోకంలో జార్జికి వచ్చిన కీర్తి వలన ప్రయోజనం ఏమున్నది? ఒకవేళ అతడు లోకాన్ని విడిచి వెళ్ళ వలసివస్తే ఈ లోకభోగములు, పేరు ప్రఖ్యాతులు అతనికి శాంతిని ఏవిధంగా ఇయ్యగలవు?”.” అంతయు వ్యర్థము, సమస్తమును వ్యర్థము” అనే స్వరము అతని ప్రశ్నకు సమాధానంగా వినబడింది. ఆ తరువాత దేవుని కృప చొప్పున జార్జికి సంపూర్ణముగా స్వస్థత కలిగింది. ఇంగ్లండ్ దేశంలోని ప్రార్ధనాపరులైన ఇద్దరు స్త్రీలు వారి కొరకు ప్రార్ధించారు. దాని ఫలితంగా ఛార్లెస్ పునరుజ్జీవింపబడి ప్రభువు సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన స్నేహితులను దర్శించి వారికి రక్షణ సువార్తను భోధించేవాడు. క్రికెట్ ఆటకంటే క్రీస్తును అధికంగా ప్రేమించగలిగాడు. “ఆత్మలను రక్షించునప్పుడు వచ్చే ఆనందంలో ఇహలోక మిచ్చెడి ఆనందంతో సరితూగదు” అని స్టడ్ చెప్పేవాడు.
సేవకై పిలుపు
ఛార్లెస్ స్టడ్ 1884 వ సంవత్సరంలో బిఎ డిగ్రీ పొందిన తరువాత క్రీస్తును మాత్రమే సేవించాలి అని నిశ్చయించుకున్నాడు. చైనా దేశానికి వెళ్ళమని దేవుడు అతనిని ఆజ్ఞాపిస్తున్నట్లుగా గ్రహించాడు. తనను విడిచి వెళ్ళవద్దని తల్లి కన్నీటితో మొర్ర పెట్టగా ఆందోళన చెందిన ఛార్లెస్ ప్రార్ధించినపుడు “ ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు” అనే దైవాత్మ హెచ్చిరికను విన్నాడు. చైనాకు మిషనరీగా వెళ్ళుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అతనితో పాటు అతని సోదరులు మరో ఆరుగురు సహాధ్యాయులు చైనా వెళ్ళుటకు సిద్ధపడ్డారు. వీరందరినీ ‘కేంబ్రిడ్జి సప్తకము’ అని పిలిచేవారు. వీరికి తన ఆశీర్వాదాలను పంపుచూ విక్టోరియా రాణి ప్రోత్సహించింది. స్టడ్ ప్రసంగిస్తుండగా వేలకొలది విద్యార్ధులు ప్రభువు వద్దకు వచ్చారు. కొంతకాలం ఇంగ్లండ్ లో సేవ చేసిన తరువాత క్రీ.శ 1885 ఫిబ్రవరి నెలలో వారు బయలుదేరి ఏప్రిల్ 1న చైనా దేశాన్ని చేరారు. మార్గమందు ఓడలో తోటి ప్రయాణీకులను, ఓడ పనివారికిని రక్షణ వాక్యము ప్రకటించి వారిని ప్రభువు లోనికి నడిపించాడు.
చైనాలో సేవ
చైనా దేశంలో వారు అక్కడి ప్రజల వలె వస్త్రాలు ధరించి అనేక ప్రాంతాలను దర్శించారు. ఛార్లెస్ ఉత్తర దిక్కునకు ప్రయాణించి 3 నెలలో 1800 మైళ్ళు ప్రయాణించాడు. పడవల మీద, కంచర గాడిదల పై , కాలినడకన ప్రయాణిస్తూ మురికితో నిండిన సత్రాలలో బస చేస్తూ, ఇష్టం లేని ఆహారాన్ని తింటూ చైనా భాషను నేర్చుకున్నాడు. బైబిల్ తప్ప ఇతర పుస్తకాలను చదువుట మాని దైవవాక్యాన్నే ధ్యానించసాగాడు. ప్రతిదినము 40 మైళ్ళు నడచుటచే అతని కాళ్ళకు పుండ్లు వచ్చేవి.
ఛార్లెస్ హాంగ్ కాంగ్ లో ఉన్నప్పుడు తన సహోదరులకు ఈవిధంగా ఉత్తరం రాసాడు.” మీరు క్రికెట్ గాని, ఇతర ఆటలు గాని ఆడకూడదని నేను చెప్పను. ఆటలయందు క్రీస్తును స్తుతించుచు ఆనందించుడి. కాని ఆటలు నాకు విగ్రహమైయున్నట్లుగా మీకును మరియు క్రీస్తునకు మీ ఆటలు అడ్డురాకుండా చూచుకొనుడి. ఆటల ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించుటకును , క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటలోను గల వ్యత్యాసాన్ని గమనించండి. కాలము సంకుచితముగా ఉన్నది. గనుక నిత్యనాశనమునకు వెళ్లిపోయే ఆత్మలను సంపాదించుటకు త్వరపడండి”.
స్టడ్ ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. తెల్లవారుజామున 3.30 గంటలకే లేచి ప్రార్థన, వాక్యధ్యానం చేసేవాడు. ఆ సమయం ప్రశాంతంగా ఉండుటచే ప్రభుని స్వరం తప్ప మరి ఏ చిన్న శబ్దం కూడా వినపడదు. ఆ సమయంలో చదివే వాక్యభాగం దినమంతయూ మనస్సులో ముద్రితమై ఉండేది.
ఛార్లెస్, హడ్సన్ టేలర్ ను కలుసుకోవడానికి ‘హాన్ చుంగ్’ అనే ప్రదేశానికి వచ్చాడు. కాని విదేశీయులను హత్య చేయుచున్నారని తెలిసికొని చేరువలో ఉన్న ‘చుంకింగ్’ అనే ప్రాంతంలో ఉన్న పందుల గుడిసెలో కొన్ని దినాలు ఉండవలసి వచ్చింది.
పిత్రార్జితమును ధర్మము చేయుట
ఛార్లెస్ కు దాదాపు 29 వేల పౌండ్లు ఆస్తి పిత్రార్జితముగా సంక్రమించింది. ఆ దినాలలో అది సుమారు 4 లక్షల 35 వేల రూపాయలు. ఆయన ఆ ధనాన్ని డి.యల్.మూడీ గారి పరిచర్యకు, జార్జి ముల్లర్ అనాథ శరణాలయానికి, విలియం బూత్ రక్షణ సైన్యానికి, లండన్ పట్టణంలోని పేద ప్రజలకు కానుకగా ఇచ్చేశాడు. మిగిలిన 3,400 పౌండ్లు తాను వివాహం చేసుకోదలచిన ప్రిస్కిల్ల అనే యువతికి కట్నంగా ఇచ్చాడు. కాని ఆమె దానిని నిరాకరించి దేవుడు నీకు కలిగినదంతా బీదలకు ఇమ్మని చెప్పాడు గనుక ఆవిధంగానే చేయమని చెప్పింది.
స్టడ్ వివాహానంతరం వారి వద్ద ధనమేమి లేకుండా సంసారాన్ని ప్రారంభించారు. దేవుడు 41 సంవత్సరాలు వారి సంసార నౌకను సురక్షితంగా నడిపించాడు.
ప్రిస్కిల్ల తో వివాహం :
ప్రిస్కిల్ల లివింగ్ స్టన్ స్టీవార్డ్స్ అనే ఐర్లాండ్ దేశానికి చెందిన యువతి. ఆమె ఆటపాటలు, నాట్యము మొదలగు లౌకిక వినోదాలయందు మక్కువ కలిగి దేవునికి దూరంగా ఉండేది. ఒక మీటింగ్ లో దేవుడు ఆమెతో “అక్రమము చేయువారలారా నా యెద్ద నుండి వెళ్ళుడి, నేను మిమ్ములను ఎరుగను” అని మాట్లాడగా ఆమె సమాధానము లేని స్థితిలో ప్రార్ధించింది. సిలువ దర్శనాన్ని చూసిన ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా స్వీకరించింది. ఆమె బైబిల్ చదువుచుండగా పుస్తకపు అంచులపై చైనా, ఇండియా, ఆఫ్రికా అనే మాటలు లిఖించబడినట్లుగా కనబడింది. ఆమె అనేకులకు తన ఆత్మీయ జీవితం గురించి చెబుతూ పాటలు పాడుచూ వారితో సంభాషిస్తూ ఉండేది. ఆ తరువాత మిషనరీ పరిచర్యకు సమర్పించుకొని 1887 వ సంవత్సరంలో చైనా లోని ‘షాంగై’ కు వెళ్ళింది. ప్రిసిల్లాతో ఛార్లెస్ వివాహం జరగాలని అక్కడి పాస్టర్ నిశ్చయించారు. అది దేవుని చిత్తమని గ్రహించి వారిరువురూ వివాహానికి అంగీకరించారు.
చైనాలోని ‘లంగాంగ్-ఫుల్’ (Langang-Fu) అనే పట్టణంలో సేవచేయడానికి వెళ్ళిన స్టడ్ దంపతులకు ఒక శిధిలావస్థలో ఉన్న ఇల్లు అద్దెకు దొరికింది. మంచాలు లేనందున నేలపై పరుండేవారు. ఐదు సంవత్సరాల వరకు ఆ పట్టణ ప్రజలు వీరిని ఎంతో దూషిస్తూ బాధించారు. అక్కడ వచ్చే తెగుళ్ళు, అతివృష్టి, అనావృష్టికి కారణం వీరే అని భావించేవారు. కాని స్టడ్ దంపతులు ఎంతో స్నేహపూర్వకంగా వారితో ఉంటూ క్రీస్తును ప్రకటించేవారు. చెరసాలలో వున్న రోగులను దర్శించేవారు. నల్లమందుకు బానిసలుగా మారిన వారిని ఆ దురలవాటును మాన్పించుటకు ఎంతో శ్రమపడేవారు. వారి వద్దకు వచ్చిన ప్రతిఒక్కరు కొద్ది దినాలకే పూర్తిగా స్వస్థతనొంది రక్షణానందముతో తిరిగి వెళ్ళేవారు.
కుటుంబ జీవితం
స్టడ్ దంపతులకు నలుగురు కుమార్తెలు జన్మించారు. వారికి గ్రేస్ అనగా కృప, డోరతి అనగా స్తుతి, ఎడిత్ అనగా ప్రార్థన, పాలినా అనగా సంతోషము అను పేర్లు పెట్టారు. ఎక్కువ కుమార్తెలు కలుగుట నాశన హేతువని తలంచేవారు చైనీయులు. కాని స్టడ్ దంపతులు టం నాల్గవ కుమార్తెకు సంతోషం అని పేరు పెట్టుట వారిని ఆశ్చర్యపరచింది. అనారోగ్యంతో ప్రిస్కిల్లా మరణ శయ్యపై ఉన్నప్పడు “ మీరు మీ స్వదేశానికి వెళ్ళండని అనేకులు వారికి సలహా ఇచ్చారు. దేవుని సెలవు లేనిదే ఆయన పనిని విడచి వెళ్ళలేమని" స్టడ్ దంపతులు బదులిచ్చారు. సువార్త పరిచర్యకు రాకమునుపు ఛార్లెస్ వైద్య తర్ఫీదు కూడా పొందియుండుటచే తనకు తానే వైద్యం చేసుకునేవాడు. వారికి ఐదవ కుమార్తె జన్మించి కొద్ది దినాలకే మరణించింది. ఆ సమయంలో స్టడ్ ఇంటి వద్ద లేడు. “ సువార్త సేవలో నన్ను అభ్యంతరపరచెడు ఎట్టి పరిస్థితికైనను నా జీవితంలో తావియ్యను. నేను నా భర్తను అధైర్య పరిచే విధంగా ఒక్క కన్నీటి బిందువును కూడా కార్చను” అని ప్రిస్కిల్లా నిశ్చయించుకుంది.
స్టడ్ దంపతులు 5 డాలర్లతో తమ సంసారాన్ని ప్రారంభించారు. వారు చైనా దేశపు మధ్య భాగంలో ఉన్నప్పటికి వారి ప్రతి అవసరాన్ని తీర్చుటకు దేవుడు సమర్ధుడని నమ్మారు. ఒకసారి వారి వద్ద ఉన్న భోజనపదార్థాలు అన్నీ అయిపోయినప్పుడు వారు కొంత సమయం ప్రార్ధించి పోస్ట్ మాన్ కొరకు ఎదురు చూడ సాగారు. అతడు వారికి కొన్ని ఉత్తరాలను అందించాడు. చివరలో ఒక కవరు తెరవగా వారికి తెలియని వ్యక్తి పేరుతొ 100 పౌండ్ల చెక్ ఉంది, అతడు దేవుడు తనతో ఆ డబ్బును పంప వలసినదిగా ఒత్తిడి చేశాడు అని తెలియజేసాడు. ఈవిధంగా అనేకమార్లు వారి ప్రతి అవసరమును దేవుడు తీర్చాడు.
ఇంగ్లండ్ మరియు ఇండియా దేశాలలో పరిచర్య
స్టడ్ దంపతులు 1894 వ సంవత్సరంలో స్వదేశానికి బయలుదేరారు. ఇద్దరు చైనా యువకులను తమ బిడ్డలకు నర్సులుగా ఉండుటకు మరియు చైనా భాషను నేర్పించుటకు వారితో పాటు ఉంచుకున్నారు. అ యువకులిద్దరూ ఎంతో వేదనతో స్టడ్ కుటుంబానికి వీడ్కోలు పలికారు. రోగ పీడుతులై కృశించిన శరీరాలతో వారు ఇంగ్లండు దేశాన్ని చేరారు. వారిని చూసిన అనేకులు వారిని పోల్చుకోలేకపోయారు. స్వదేశంలో కూడా వారు దేవుని పనిని కొనసాగించారు. 1896 న స్టడ్ అమెరికా దేశానికి అక్కడి వారి ఆహ్వానం మేరకు సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళాడు. అనేకులు అతని ప్రసంగాలు విని రక్షింపబడ్డారు. అనేక మంది విద్యార్థులకు అతడు వ్యక్తిగత పరిచర్య చేశాడు
.
ఇండియా దేశానికి వెళ్లి సువార్త ప్రకటించాలనే భారము ఛార్లెస్ లో అధికమయ్యింది. అతని తండ్రి ఎడ్వర్ద్ ఇండియాకు సువార్తికునిగా రావాలని ఆశించాడు. కాని అది సఫలము కాకుండానే మరణించాడు. అతడు 1900 సంవత్సరంలో తన కుటుంబసమేతంగా ఇండియాకు వచ్చాడు. దక్షిణ భారత దేశము లోని ఆంగ్లో ఇండియన్ సంఘము వారు ఆయనను ఆహ్వానించారు. “”స్టడ్ బోధించే గుడికి వెళ్ళవద్దు; వెళ్ళినచో మీరు తప్పక క్రైస్తవులై పోతారు” అనే కొందరు వ్యతిరేకులు ప్రచారము చేయసాగారు. తేయాకు తోటలలో పనిచేసే వారు, మిలటరీ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు మరియు యూరోపియన్ల మధ్య పనిచేశాడు. అప్పుడు మద్రాసు గవర్నర్ గా ఉన్న లార్డ్ ఆంపిల్, స్టడ్ యొక్క క్రికెట్ కీర్తిని ఎరిగినవాడై అనేకమార్లు తన గృహానికి ఆహ్వానించాడు. ఆంగ్లేయ సైనికులు అనేకులు అతనితో క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా అతనితో చాలా స్నేహంగా ఉండేవాడు. క్రికెట్ ద్వారా వారిని ఆకర్షించి రాత్రి పూట వారి కొరకై ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించాడు.
1906- 1908 వరకు వారు తిరిగి తమ స్వదేశంలో సువార్త పరిచర్య చేశారు. ఆ తరువాత ఇండియాకు వెళ్లాలని తలంపుతో ఉన్న స్టడ్ దంపతులకు , ‘లివర్ పూల్’ లోని ఒక గోడపై “ఆఫ్రికా ఖండంలో నరమాంసభక్షకులు మిషనరీలను కోరుచున్నారు” అని పెద్ద అక్షరములతో వ్రాయబడిన గోడ కరపత్రాన్ని చూసి స్టడ్ ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటి లోపలి కెల్లినప్పుడు ఆఫ్రికాలో సంచరించి తిరిగి వచ్చిన ‘డాక్టర్ కారల్ క్యూమ్’ తన ప్రసంగంలో ఆఫ్రికా దేశంలో సువార్త ప్రకటించాల్సిన అవసరతను గురించి వివరించసాగాడు. క్రైస్తవులెవరును అక్కడకు పోలేదు ఎందుకో అని తనలో తాను ప్రశ్నించుకొనగా దేవుడు ‘నీవే ఎందుకు వెళ్ళకూడదు?’ అని స్టడ్ ని ప్రశ్నించాడు. “నేను వెళ్ళుటకు వైద్యులు అనుమతీయరు” అని స్టడ్ చెప్పగా దేవుడు “నేను మహావైద్యుడను కానా? ఆఫ్రికా దేశములో నిన్ను కాపాడలేనా” సందేహాలకు తావీయక వెళ్ళుము “ అని హెచ్చరించాడు.
50 సంవత్సరాల వయస్సులో, 15ఏళ్లుగా రోగపీడితునిగా ఉన్న అతడు ఆఫ్రికా వేడిని ఏవిధంగా తట్టుకోగలడని అతనికి సహాయం చేయుటకు ఎవరూ ముందుకు రాలేదు. అనారోగ్యముతో ఉన్న ప్రిస్కిల్ల కూడా ఆఫ్రికా వెళ్ళుటకు ఇష్టపడలేదు. స్టడ్ ఒంటరిగా క్రీ.శ 1910 డిశంబర్ 15న ‘లివర్ పూల్’ నుండి బయలుదేరాడు.
ఆఫ్రికాలో పరిచర్య
ఆఫ్రికా లోని సుడాన్ కు చేరిన తరువాత అతడు తన భార్యకు కొన్ని ఉత్తరాలు వ్రాశాడు. క్రీస్తు పరిచర్యలో కలసి పనిచేయాలని ప్రోత్సహించాడు. ఆల్ఫరేడ్ బక్సటన్ అనే ఆంగ్ల యువకుడు , స్టడ్ తో కలసి పనిచేయడానికి ముందుకు వచ్చాడు. వారిద్దరు కెన్యా, ఉగాండా ప్రాంతాలలో సంచరించారు. ఆల్ఫరేడ్ 21 సంవత్సరాల వయస్సువాడు. అంత చిన్న వయస్సులో కాంగో ప్రాంతాలలో ప్రయాణించుట మంచిదికాదని అతని కుటుంబీకులు అతనికి కేబుల్ వర్తమానం పంపారు. కాని కష్టాలలో, శ్రమలలో, మానవులతో సంప్రదించకుండా ప్రభువు నడిపింపుతో వీరిరువురూ ముందుకుసాగారు. వారు 1913 అక్టోబర్ 16న నయగారా ప్రాంతానికి చేరి ‘నాల’ అనే గ్రామంలో కొంత స్థలాన్ని సంపాదించి మిషనరీల కొరకు ఒక ఇల్లును కట్టారు. దానికి ‘బకింగ్ హామ్ ప్యాలస’ అని పేరు పెట్టారు. ఆ ఇంటిలో అనేకమార్లు స్టడ్ ప్రాణాపాయ స్థితి నుండి, విష సర్పాల బారి నుండి తప్పించబడ్డారు. రెండు సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత 1915 వ సంవత్సరంలో స్టడ్ 12 మందికి బాప్తీస్మం ఇచ్చాడు. నైల్ , కాంగో నదుల మధ్య 50 జాతుల వారు ఉన్నప్పటికీ వారంతా ‘బంగళ భాష’ ను మాట్లాడేవారు. విదేశీయులు కూడా ఈ భాషను సులభంగా నేర్చుకోగలరు. ఆల్ఫరేడ్ బంగళ భాషను నేర్చుకొని బైబిల్ ను ఆ భాష లోనికి తర్జుమా చేశాడు. ఆ తరువాత వచ్చిన మిషనరీలకు అది ఎంతగానో ఉపయోగపడింది.
ఆఫ్రికా మిషన్ :
1914 వ సంవత్సరంలో స్టడ్ ఇంగ్లండ్ కు వచ్చి ఆఫ్రికా మిషన్ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు. స్టడ్ యొక్క సతీమణి అనారోగ్యంతో మంచానికే పరిమితి అయ్యింది. ఆ స్థితిలో నుండే ఆమె ప్రార్థనా సంఘాలను ఏర్పాటు చేసింది. వైద్యుల సలహాను పాటించకుండా రోజు 30 వరకు ఉత్తరాలు వ్రాసేది. ఒక మాస పత్రికను ప్రచురించేది. ‘మధ్య ఆఫ్రికా మిషన్’ అనే పత్రికను నడుపుటలో ఆమె కుమార్తెలు ఎడిత్, పాలీనాలు ఆమెకు సహాయం చేసేవారు.
1916 వ సంవత్సరంలో అతడు అఫ్రికాకు తిరిగి వెళ్లాలని బయలుదేరినప్పుడు ‘స్టడ్ చనిపోతే ఎలా?’ అని చాలామంది ప్రశ్నించారు. దానికి స్టడ్ “ నేను చనిపోయినచో ఒక బుద్దిహీనుడు ఈ లోకంలో తక్కువ అవుతాడు. దేవుడు బ్రతికియున్నంత కాలము ఆఫ్రికా మిషన్ కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు ఇంకా అద్భుతాలను చేయనున్నాడు” అని బదులిచ్చాడు. ఆయనతో కూడా అఫ్రికాకు అతని కుమార్తె ఎడిత్ మరో ఎనిమిది మంది అఫ్రికాకు బయలుదేరారు. అన్ని విషయాలలో తన తోటి పనివానిగా ఉన్న ఆల్ఫరేడ్ కు తన కుమార్తె ఎడిత్ తో వివాహం జరపాలని నిశ్చయించాడు. ఆ తరువాత స్టడ్ ఎన్నడూ తన స్వదేశాన్ని గాని, భార్యను గాని చూసే అవకాశం కలుగలేదు.
విజయవంతమైన పరిచర్య :
ఆల్ఫరేడ్, ఎడిత్ ల వివాహం నయాగరాలో అఫ్రికనుల మధ్య జరిగింది.
మిషనరీల యొక్క సాక్ష్యాలను ఆశీర్వదించి అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. ఆఫ్రికన్ క్రైస్తవులు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి తాము తెలిసికొనిన క్రీస్తును ప్రకటించారు. క్రొత్తగా రక్షింపబడిన వారు అనేక మైళ్ళు ప్రయాణం చేసివచ్చి మిషనరీలతో మాట్లాడేవారు. 1920 వ సంవత్సరంలో మరికొందరు మిషనరీలు ఆఫ్రికా సేవకు ఇంగ్లండ్ నుండి వచ్చారు. వారిలో స్టడ్ చిన్న కుమార్తె పాలీనా కూడా ఉంది. ఛార్లెస్ స్టడ్ ‘ఇబాంబి’ రాష్ట్రమునకు వచ్చి క్రొత్తగా అక్కడ పనిని ప్రారంభించాడు. అనేకులు క్రీస్తును నమ్మి బాప్తీస్మం తీసుకున్నారు. స్టడ్ ను వారు ‘భవానా’ అని పిలిచేవారు. ఆ పదానికి ‘పెద్ద దొర’ అని అర్థం. ప్రిస్కిల్లా స్టడ్ తన భర్త వెళ్ళిన తరువాత విశ్వాసం మీదనే ఆధారపడి జీవించుటకు నిశ్చయించుకుంది. ఆమె అనారోగ్యముతో ఉన్నప్పటికీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాస్మేనియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లి ఆ దేశాలలో మిషన్ కేంద్రాలను తెరచింది.
ముగింపు
ఛార్లెస్ స్టడ్ ఆఫ్రికా దేశంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. స్టడ్ చేసిన సేవ ఫలితంగా రక్షణ లోనికి వచ్చిన దాదాపు 1000 మంది స్త్రీ ,పురుషులు హాజరయ్యారు. వారంతా పరిశుద్ధాత్మ పూర్ణులై పాటలు పాడిన పిమ్మట స్టడ్ ‘అమూల్యమైన ముత్యము’ గురించిన ప్రసంగాన్ని చేశాడు. ఆ దినము వారితో ఎంతో సంతోషంగా గడిపాడు.ఆ తరువాత అతడు మాట్లాడలేకపోయాడు. ‘హల్లెలూయ’ అని మాత్రం పలికేవాడు. మూడు దినాల తరువాత అతడు నిత్య విశ్రాంతి లోనికి వెళ్ళాడు. ‘సైనికుడు’, ‘పరిశుద్ధుడు’ అని వ్రాయబడిన గుడ్డను స్టడ్ దేహం పై కప్పి ‘భవానా’ చూపించిన క్రీస్తు మార్గంలో జీవిస్తామని ప్రమాణం చేశారు వారంతా.
Also Watch ---
Monday, 2 June 2025
Subscribe to:
Posts (Atom)
Quotes from Famous Scientists about God
- Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
- Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
- Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
- Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.