వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం
మనం దేవుణ్ణి, ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత్తం లేకుండానే అర్థం చేసుకోవడం సాధ్యపడదా? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న పాఠాలన్నిటినీ గ్రహించలేకపోవచ్చు. బైబిల్ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక సంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదువరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ -సూచించగలరు. బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొందరు బైబిల్ రచయితలు సహితం ఇలా భావించారు (2 పేతురు 1:20; 3:15,16 చూడండి).
బైబిల్ను అర్థంచేసుకోవడానికి బైబిల్ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వారా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్ విరుద్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు. దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపిస్తారు (ఎజ్రా 8:8; అపొ కా 8:28-35). దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పజెప్పు" అని పౌలు తిమోతిని ఆదేశించాడు. (2 తిమోతి 2:2). ఈ స్టడీ బైబిల్ జాగ్రత్తగా ఉపదేశించడానికీ, పొరపాటు భావనలను సరిదిద్దడానికీ, తప్పుడు మార్గాలనూ క్రియలనూ మందలించడానికీ, దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్సహించడానికీ సహకరిస్తుంది.
బైబిలును అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ అందించే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం (1 కొరింతు 2:10-14). దీనిని ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి, ఆయనపై ఆధారపడాలి.
Produced by
GRACE MINISTRIES In Partnership With INDIA BIBLE LITERATURE