Monday 1 July 2024

వి.యస్.అజరయ్య - భారతదేశంలో ఆంగ్లికన్ చర్చ్ తొలి బిషప్



                                     

మొదటి శతాబ్దములోనే యేసు క్రీస్తు శిష్యులలో ఒకరైన తోమా భారతదేశంలో  సువార్తను ప్రకటించారు. ఆ తరువాత అనేక దేశాలకు సంబంధించిన సంఘాల వారు మిషనరీలను పంపించారు. 17 వ శతాబ్దంలో బ్రిటిష్ దేశానికి చెందిన ఆంగ్లికన్ చర్చ్  మిషనరీలు మన దేశానికి వచ్చారు.

సెయింట్ పాల్స్ కెథడ్రిల్, కలకత్తా నగరం. డిసెంబర్ 12,1912 వ సంవత్సరం. అక్కడ అంతా ఉత్సవ వాతావరణం నిండి ఉంది. భారతదేశం అంతా కలిసి ఆ కెథడ్రిల్ కే వచ్చిందా అన్నట్లుగా అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దానికి కారణం దైవజనుడైన ఒక వ్యక్తి. ఆయన క్రైస్తవ ఐక్యతకు  ప్రతీక, సువార్త పరిచర్యకు అపోస్తలుడు. అరణ్యంలా ఉన్న భారతదేశ క్రైస్తవ సంఘానికి మొట్ట మొదటి బిషప్ గా ఆంగ్లికన్ సంఘముచే అభిషేకం చేయబడిన బిషప్ వేద నాయగం శామ్యూల్ అజరయ్య. 

బాల్యం, విద్యాభ్యాసం :

అజరయ్య కన్యాకుమారికి దగ్గరగా ఉన్న వెల్లనవిలాయ్ అను గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంటగింజలను అమ్మేవాడు. ఆయన తన చిన్నతనంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి సత్యాన్వేషణలో సిఎంఎస్ (చర్చ్ మిషనరీ సొసైటీ)  నకు సంబంధించిన మిషనరీల వద్దకు వెళ్ళాడు. 1839 లో బాప్తీస్మం తీసుకొని థామస్ వేదనాయగం అనే పేరుతో పిలువబడ్డాడు,1869 లో డీకన్ గా చర్చిలో ఉంటూ సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయనకు 13 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆగష్టు 17, 1874 లో మగపిల్లవాడు జన్మించాడు. అతనికి శామ్యూల్ అజరయ్య అని నామకరణం చేశారు. అతడు చిన్నప్పటి నుండి చదువులలో , బైబిల్ జ్ఞానం లో ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవాడు. అతడు ప్రార్థనాపరులైన తన తల్లిదండ్రులను, గురువులను ఎంతగానో అభిమానించేవాడు.

1885, జనవరి 1 న ఆయన తిరునల్వేలి లోని మైజ్ఞానపురం అనే ప్రదేశంలో సిఎంఎస్ బోర్డింగ్ స్కూల్ నందు చేరారు. ఆ తరువాత కాలేజీ విద్యను మధ్యలో విడచి  పాలాయనకోటం లోని సిఎంఎస్ హైస్కూల్ లో టీచరుగా కొంతకాలం పని చేశారు.  ఉన్నత విద్యకై మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడి ప్రిన్సిపాల్ డాక్టర్ విలియం ముల్లర్ అజరయ్య ను ఎంతో ప్రభావితం చేశారు. కాని ఇంఫ్లుఎంజా రావడం వలన బిఎ ఆఖరి సంవత్సరం పరీక్షలను రాయలేకపోయారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఆయన యూనివర్సిటీ విద్యను కొనసాగించలేకపోయారు.

ఉద్యోగం, వివాహం  :

 అజరయ్య 14 సంవత్సరాలు వైఎంసిఎ నందు పనిచేశారు. అక్కడ ఆయనకు జాన్.ఆర్.మోట్, జార్జ్ షేర్ఉడ్ ఎడ్డీ , రాబర్ట్ విల్డర్ మరియు జి .ఉల్డ్ హామ్ అను వారు మిషన్స్ పట్ల ఆసక్తిని కలిగించారు. వారు స్టూడెంట్ వాలంటీర్ మూమెంట్ ను ప్రారంభించారు. ఈ తరము లోని ప్రపంచాన్ని సౌవార్తీకరించడమే దాని ప్రధాన లక్ష్యం. జూన్ 29, 1898 న అజరయ్య  అంబు మణియమ్మాల్ ను పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా తిరునల్వేలికి చెందిన మిషనరీ మనస్సు కలిగి దైవజ్ఞానంతో నిండిన స్త్రీ. ఆమె తన భర్తను ప్రోత్సహిస్తూ సాటియైన సహకారిగా ఉండేది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను సంతానంగా దేవుడు అనుగ్రహించాడు.

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో పరిచర్య :

1836 వ సంవత్సరంలో మద్రాసుకు చెందిన బిషప్ కోరి ఆంధ్రప్రదేశ్ ను దర్శించారు. అక్కడ  కేవలము నలుగురు భారతీయ క్రైస్తవులు మాత్రమే నిర్థారణకు సిద్ధంగా ఉన్నారు. 1837 లో కృష్ణా జిల్లా కలెక్టరుగా పనిచేసిన దైవభక్తి గల గోల్డింగ్ హామ్  ఈ విధంగా తెలియచేసారు. “ ఆంగ్లికన్ చర్చికి చెందిన ఏ ఒక్క సువార్తికుడు తెలుగు ప్రజలకు సువార్తను ప్రకటించుటకు గాని , కనీసం కరపత్రికలను వారి భాషలో ఇచ్చుటకు గాని ఇంతవరకు  ఎవరూ రాలేదు”. అనేక క్రైస్తవ మిషనరీ సంస్థలు దీని విషయమై ప్రార్ధించాయి. 1835 లో నెల్లూరు నందు అమెరికా బాప్టిస్ట్ మిషన్ వారిచే పరిచర్య ప్రారంభమయ్యింది. ఆ తరువాతి దినాలలో బందిపోటు దొంగగా ఉన్న వెంకయ్య అనే వ్యక్తి మార్పు వలన క్రైస్తవ ఉద్యమం బలపడింది. 1901 వ సంవత్సరానికంతా కృష్ణా జిల్లాలో 29,186 మంది క్రైస్తవులుగా మారారు. ఆ తరువాత జార్జ్ షేర్ఉడ్ మరియు ఎడ్డీ అనే మిషనరీలు భారతదేశమంతా తిరిగి సువార్త అందని అనేక ప్రదేశాలు ఇంకా ఉన్నాయని గుర్తించారు. వైయంసిఎ నందు వారి సహోద్యోగి అయిన అజరయ్యతో ఈ విషయాన్ని పంచుకున్నారు. భారతదేశాన్ని అంతా సువార్తతో సంధించాలనే ఆకాంక్ష యువకుడైన అజరయ్య లో కలిగింది. 1903 లో తిరునల్వేలి ఇండియన్ మిషనరీ సొసైటీని  కొందరు తమిళ క్రైస్తవ పరిచారకులతో కలిసి ప్రారంభించారు. అపోస్తలుడైన పౌలు వలె ఆయన సువార్త అనేక ప్రాంతాలలో , వేరొకరు పునాది వేయని స్థలాలలో మాత్రమే సువార్తను ప్రకటించాలని నిశ్చయించుకున్నారు. అప్పటికి సువార్త అందని ప్రాంతముగా ఉన్న డోర్నకల్ ను వారు చేరుకున్నారు. ఆ దినాలలో అది హైదరాబాద్ నిజాంల పాలనలో వున్నది. 1905 లో అజరయ్య మరియు అతని స్నేహితుడు కె.టి.పాల్ కలిసి నేషనల్ మిషనరీ సొసైటీని ప్రారంభించారు. భారతదేశము మరియు పొరుగు దేశాలలోని సువార్త అందని ప్రదేశాలకు వెళ్లి ప్రకటించుట దీని లక్ష్యం. ఇండియా ప్రజలు, ఇండియా డబ్బు మరియు ఇండియన్ల యొక్క మార్గదర్శకం లో ఇది పనిచేస్తుంది. 1906 లో వారికి వాలంటరీగా వచ్చిన ధనము 2,000 రూపాయలు. అజరయ్య ఆయా ప్రదేశాలలో ప్రజలకు సువార్త అందించడమే కాకుండా  అక్కడి ప్రజల  అవసరాలను గుర్తెరిగి పనిచేయాలని సంకల్పించారు.  అనేకమందిని మిషనరీలుగా వెళ్ళడానికి ఉత్తేజ పరిచిన పిమ్మట , నేనే ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు? అన్న ప్రశ్న ఆయన మనస్సులో దేవుని స్వరము అడుగుటచే దానికి లోబడి డోర్నకల్ కు వచ్చుటకు సిద్ధపడ్డారు.

మిషనరీ పరిచర్యలో అజరయ్య దంపతులు : 

శ్రీమతి అంబు అజరయ్య మిషనరీ పరిచర్య అంతటిలో ఎంతో సహకారం అందించింది. క్రొత్త ప్రదేశంలో ఇంటి వసతులు సరిగా లేకపోయినా, తగ్గింపు గల జీవితాన్ని ఎంతో ధైర్యంగా సంతోషంతో స్వీకరించింది. ఆమె తన తోటి పరిచారకులకు ఎన్నో విధాలుగా తోడ్పడేది. డోర్నకల్ లో పాఠశాల  మరియు బోర్డింగ్ స్కూల్ నెలకొల్పడంలో, స్త్రీలను పరిచర్యలో ప్రోత్సహించడంలో ఆమె కృషి మరువలేనిది. ఆమె తల్లులకు ప్రత్యేకంగా కరపత్రికలను ముద్రించి పంచిపెట్టేది. అజరయ్య కూడా అనేక రచనలను చేశారు. క్రైస్తవ దాతృత్వము పై  ఆయన రాసిన పుస్తకము 50  కి పైగా భాషల లోనికి అనువదించబడింది. బాప్త్తీస్మము , ప్రభురాత్రి భోజనము సంస్కారము, ప్రకటన  గ్రంథము యొక్క కామెంటరీ మొదలగు వాటిని  ఆయన రచించారు. 1922 లో డోర్నకల్ డయాసిస్ గా ఏర్పడింది. 

1915 లో డోర్నకల్ చర్చి కట్టడానికి పునాది వేయబడింది. 1938లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ కెథడ్రిల్ డిజైనింగ్ అంతా అజరయ్య స్వయంగా చేశారు. ఇటుక వెంబడి ఇటుక పేర్చుకుంటూ అది దేవుని ఆరాధనకు ఒక మహిమకరమైన ప్రదేశంగా కట్టబడుటలో అజరయ్య పాత్ర మరువలేనిది.

జూన్ 1910 లో స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో ప్రపంచ మిషనరీ సదస్సు జరిగింది. దానిలో  అనేక మంది ప్రముఖ మిషనరీలు పాల్గొన్నారు. అందులో తన స్వరం వినిపించే అవకాశం వచ్చింది అజరయ్యకు. విదేశీ మిషనరీలు మరియు వారి సహ  ఉద్యోగుల మధ్య ఉన్న బలహీన సంబంధాలు, సాంఘిక అసమానతలను ఆయన తనదైన శైలిలో దృఢమైన స్వరంతో వినిపించారు. ఈ ప్రసంగము ద్వారా భారతదేశ మిషనరీ ఉద్యమంలో అనేక మార్పులు రావడానికి నాంది పలికింది. ఆయనకున్న రెండు లక్ష్యాలు డోర్నకల్ కెథడ్రిల్ నిర్మాణం మరియు పిల్లల కొరకు వసతి గృహం. ఈ రెండు కూడా చక్కని నిర్మాణ శైలిలో హైదరాబాద్ నిజాం యొక్క అనుమతితో ఆయన నెరవేర్చారు.

అజరయ్య విశిష్టతలు మరియు రచనలు:

అజరయ్య ఆద్వర్యంలో ఒక బలమైన సంఘం డోర్నకల్ లో స్థాపించబడింది. దానిని ఆత్మీయంగా బలపరచుటలో ఆయన ఎనలేని కృషి చేశారు. సౌవార్తిక ప్రయత్నాలను కొనసాగించారు. నూతన ప్రదేశాలలో సువార్తను ప్రకటించారు. బాప్తీస్మము ఇవ్వడంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా సభ్యులకు హెచ్చరికలు ఇచ్చేవారు. ఆయన సంఘానికి ‘ ప్రతీ క్రైస్తవుడు ఒక సాక్షే’ అనే నినాదాన్ని ఇచ్చి ‘ సాక్ష్యపు వారాన్ని’ పాటించాడు. అది నూతన వ్యక్తులకు సువార్త ప్రకటించడానికి ఒక చక్కని సృజనాత్మకమైన ఆలోచన. అపోస్తలుడైన పౌలు వలె సంఘంలో బలమైన పునాదులను వేయుటకు బిషప్ అజరయ్య పాటుబడ్డారు. 

‘ ఈ తరం లో బైబిల్ ను అధ్యాయం చేసే సంఘం ‘ మరియు ‘ ప్రతి ఒక్కరూ ఒకనికి బోధించండి’ వంటి నూతన పద్ధతులను ప్రవేసపెట్టి బైబిల్ అధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆయన పాస్టర్లకు వేదాంత విద్యలో తర్ఫీదు చేయుటకు ప్రాముఖ్యత నిచ్చేవారు. పాస్టర్ల అవసరాలు తీర్చే భాద్యత సంఘానిదే అని ఆయన భావించేవారు. గ్రామీణ జీవన విధానాన్ని అర్థం చేసికొని వారికి బోధించాలని ఆయన పాస్టర్లకు తెలియజేసేవారు. వారి సమస్యలను అర్థం చేసికొని సహాయం చేసేవారు.

బిషప్ అజరయ్య బైబిల్ ను ఎంతో ప్రేమించేవారు. ‘ నా చిన్నతనంలో నా తల్లి ద్వారా నేను బైబిల్ జ్ఞానం సంపాదించుకున్నాను. బైబిల్ పట్ల ప్రేమను అది నాలో పెంపొందించింది’ అని ఆయన చెప్పేవారు. సంఘ నాయకులకు సంవత్సరాంతంలో జరిగే రిఫ్రెషర్ కోర్సులలో ఆయన బైబిల్ ఎక్స్ పోజిషన్స్  ఇచ్చేవారు. అది ఎంతో సమగ్రమైన అధ్యయనంతో , వాస్తవ విషయాలతో అత్మీయాభివృద్ధి కి తోడ్పడేది.

ఆయన చేసిన మిషనరీ పరిచర్యకు ప్రభావితురాలైన ఆయన కుమార్తె మెర్సీ మిషనరీగా సమర్పించుకొని మధ్య భారతదేశంలోని గోండుల మధ్య పరిచర్య చేయుటకు తీర్మానం చేసుకుంది. అక్కడ ఆ పరిచర్య కొనసాగుటలో బిషప్ అజరయ్య ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.   భారతదేశాన్ని క్రీస్తు కోసం గెలవాలన్న దీక్ష , బలమైన ఆకాంక్ష , పట్టుదల కలిగి ఉండేవాడు. ఆయనను ‘క్రైస్తవ ఐక్యతకు అపోస్తలుడు’ అని క్రైస్తవ నాయకులు సంభోదించేవారు. ఆయన సంఘాలలో ఐక్యతకు ఎంతో కృషి చేశారు.

ఆయన మంచి బోధకుడు. నమ్మకమైన బైబిల్ అధ్యాపకుడు. ఆయన అన్ని విషయాలు విని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన తీరిక లేని జీవితంలో కూడా ఒక పుస్తకం లేదా వ్యాసాన్ని రాయడం, అనువదించడం, ఉత్తరాలు రాయడం, ప్రత్యేక సందేశాలను తయారు చేయడం - ఇవి అన్నీ తన స్వంత చేవ్రాత తోనే చేసేవారు. ఆయన దస్తూరీ ఎంతో అందంగా ఉండేది. 180 కి పైగా పుస్తకాలు, వ్యాసాలు, అనువాదాలు చేశారు. పాస్టర్లకు మరియు బోధనకు సహాయపడే రచనలు చేశారు. హోలీ బాప్టిసం, ది పాస్టర్ అండ్ ద పాస్టరేట్ , లెసన్స్ ఆన్ మిరకల్స్, క్రిస్టియన్ గివింగ్ , కన్ఫర్మేషన్, సబ్బాత్ ఆర్ సన్ డే మొదలగు పుస్తకాలను రాశారు ఛార్లెస్.జి.ఫిన్నీ మరియు ఆండ్రూ ముర్రే ల యొక్క రచనలను అనువదించారు.

ఆయన ఎప్పుడూ బీదలను ఉద్దరించాలని ఆశించేవారు. సామాజిక సంస్కరణలను సువార్త ద్వారానే సాధించగలమని , రక్షించుటకు దేవుని శక్తి ద్వారానే సాధ్యమని ఆయన విశ్వసించేవారు. యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను అర్పించుకొనిన విధంగా ఆయన సంఘాన్ని ప్రేమించి తన సర్వస్వం సంఘసేవలోనే సమర్పించారు. ఆయన తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. 

ముగింపు : 

ఆయన తన చివరి దినాలను గ్రామాలలో గడిపారు. అప్పటి పయనీరింగ్ ప్రాంతంగా ఉన్న పరకాల లో క్రిస్మస్ ప్రోగ్రాం కు హాజరయ్యారు. బస్సులో 70 మైళ్ళు ప్రయాణం చేసి ఆ తరువాత ఎడ్లబండిలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు నిర్థారణ ఇచ్చారు. అక్కడి గ్రామప్రజలు క్రీస్తు రెండవ రాకడను గూర్చి పాడిన పాటలు విని ఆనందించారు. స్వల్ప ఆనారోగ్యంతో ఆయన డోర్నకల్ లోని తన గృహానికి తిరిగి వచ్చారు. అది తీవ్ర జ్వరంగా మారి అనారోగ్యానికి గురై 1945 జనవరి 1 న ప్రభువు సన్నిధికి వెళ్ళారు. 32 సంవత్సరాలు బిషప్ గా సుదీర్ఘమైన పరిచర్య చేసి తన తరంలో దేవుని కొరకు బలంగా వాడబడి ప్రభువు పనిని నమ్మకంగా చేసిన భారతదేశపు తొలి బిషప్ గా , సమర్థుడైన సంఘ నాయకునిగా ఆయన ఖ్యాతి చిరకాలం క్రైస్తవ సంఘ చరిత్రలో నిలచివుంటుంది. 






Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews