Thursday 15 August 2024

నారాయణ్ వామన్ తిలక్ (1861-1919)


                                  


క్రైస్తవ మరాఠీ కవి

నారాయణ్ వామన్ తిలక్ ఆధునిక మహారాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన 19వ శతాబ్దపు క్రైస్తవ మరాఠీ కవి. అతడు  మహారాష్ట్రకు చెందిన ఐదుగురు ప్రముఖ కవులలో (పంచ కవి) ఒకనిగా పరిగణించబడ్డాడు. మరాఠీ క్రైస్తవ సమాజంలోనే కాకుండా మరాఠీ సాహిత్యంలో కూడా గౌరవనీయమైన స్థానాన్ని పొందాడు. ప్రకృతిపై తిలక్ రచించిన పద్యాలు మహారాష్ట్రలోని పాఠశాలల్లో ఇప్పటికీ బోధించబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అతడు  క్రీస్తును విశ్వసించిన తర్వాత మరాఠీలో రాసిన కీర్తనలు ఈనాటికీ క్యాథలిక్ మరియు ప్రొటెస్టంట్ చర్చిలలో పాడబడుతున్నాయి.

తిలక్  కుటుంబ జీవితం

నారాయణ్ తిలక్ 6 డిసెంబర్, 1861న కొంకణ్ ప్రాంతంలోని తన తల్లితండ్రుల గ్రామమైన కరంజ్‌గావ్‌లో జన్మించారు. పండిత రమాబాయి వలె,  తిలక్ కూడా చిత్పవన్ బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. అతను నాసిక్‌లో సంస్కృతం అభ్యసించాడు మరియు 1880లో మనుబాయి (మణికర్ణిక) గోఖలేను వివాహం చేసుకున్నాడు. ఈ మనుబాయి వివాహం తర్వాత లక్ష్మీబాయి అని పేరు పెట్టబడింది మరియు మరాఠీ సాహిత్యంలో అత్యుత్తమ స్వీయచరిత్ర రచయితలలో ఒకరిగా గుర్తించబడింది.

ఉద్యోగ జీవితం మరియు క్రీస్తుతో పరిచయం

వారి వివాహం తర్వాత పదకొండు సంవత్సరాల పాటు తిలక్ నాగ్‌పూర్, ముంబై, వాణి మరియు ముర్బాద్ వంటి ప్రదేశాలలో కీర్తంకర్ గా , ఉపాధ్యాయునిగా  వివిధ ఉద్యోగాలు చేసారు. 1883 లో అతను మతానికి అంకితమైన 'రిషి' అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు అతనికి పవిత్ర బైబిల్ కాపీని అందించాడు, ఆ తర్వాత అతడు  క్రీస్తును గూర్చి అధ్యయనం చేయడంలో ఆసక్తిని పెంచుకున్నాడు. క్రమంగా, అతను యేసుక్రీస్తును ఇష్టపడటం ప్రారంభించాడు మరియు 1895లో ఆయనను తన స్వంత రక్షకునిగా  స్వీకరించాడు. అతను తన శేష జీవితాన్ని యేసుక్రీస్తు సేవకు అంకితం చేశాడు.

మరాఠీ క్రైస్తవ సమాజంలో పరిచర్య

మరాఠీ క్రైస్తవులు తమ స్థానిక సామాజిక-సాంస్కృతిక సంప్రదాయాలను వదులుకోకుండా క్రీస్తును అనుసరించడం సాధ్యమేనని తిలక్ తన స్వంత ఉదాహరణతో నిరూపించారు. అతను యేసు-కేంద్రీకృత భజనలు, కీర్తనలు మరియు ఇతిహాసాలు కంపోజ్ చేయడం ద్వారా వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాడు. 19వ మరియు 20వ శతాబ్దాలలో వేలాది మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అహ్మద్‌నగర్, పూణే, నాసిక్ మరియు ఔరంగాబాద్ జిల్లాలలోని చర్చిలలో పాశ్చాత్య ఆరాధనలను నిరోధించడంలో ఇది చాలా వరకు సహాయపడింది.

తిలక్ సతీమణి లక్ష్మీబాయి క్రీస్తును విశ్వసించుట

లక్ష్మీబాయి యొక్క 'స్మృతిచిత్రే' , సంస్కృత పండితుడైన భర్త క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు  ఆమెలో జరిగిన అలజడిని  వివరిస్తుంది. అతను మతం మారిన తర్వాత అతని దగ్గరి బంధువులు మరియు సమాజంచే బహిష్కరించబడ్డాడు మరియు దాదాపు నాలుగు సంవత్సరాలు అతని భార్య మరియు కుమారుడు దేవదత్తా నుండి దూరంగా ఉండవలసి వచ్చింది.

1890లో, లక్ష్మీబాయి తన కుటుంబ సభ్యులను ధిక్కరించి, కుమారునితో తన భర్త వద్దకు వచ్చింది. అయినప్పటికీ, ఆమె తర్వాత కూడా కొంత కాలం పాటు తన సాంప్రదాయక ఆచారాలను కొనసాగించింది మరియు అంటరాని ఇతర దిగువ కులాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటానికి నిరాకరించింది.

ఒకసారి, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది మరియు లక్ష్మీబాయి ఒక ముస్లిం మహిళ ఇచ్చిన నీటిని తాగవలసి వచ్చింది. క్రమంగా, లక్ష్మీబాయి అంటరాని వర్గాల ప్రజలు అందించే ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించింది. తన భర్తతో చేరిన ఒక సంవత్సరం తర్వాత, ఆమె కూడా క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించింది . తమ జీవిత చరిత్రను  మరియు 19వ శతాబ్దపు మహారాష్ట్రలో ఉన్న సామాజిక పరిస్థితులను అద్దం పట్టేలా లక్ష్మీబాయి ‘స్మృతిచిత్రే’ అనే తన  స్వీయ చరిత్రలో వివరించారు.

తిలక్ వ్యక్తిత్వం

తిలక్ వ్యక్తిత్వాన్ని ‘స్మృతిచిత్రే’ లేకుండా పూర్తిగా అర్థం చేసుకోలేము. వివాహితుడైనప్పటికీ, తిలక్ ఒక సన్యాసి వలె  భౌతిక అంశాల పట్ల తక్కువ శ్రద్ధ చూపేవారు. అతడు ఒక  నిజమైన  'క్రైస్తవుడు'. సమాజంలోని అణగారిన వర్గాల పట్ల దయగలవాడు, తిలక్‌ దంపతులు ఇద్దరు అనాథ బాలికలను దత్తత తీసుకుని తమ సొంత కూతుళ్లుగా పెంచుకున్న సంఘటన వారి ఔదార్యానికి అద్దం పడ్తుంది.

తిలక్ యొక్క బహుముఖ వ్యక్తిత్వానికి అనేక కోణాలు ఉన్నాయి. నిజమైన జాతీయవాది తిలక్ తన మాతృభూమిని మరియు స్థానిక సంస్కృతిని అమితంగా ఇష్టపడేవారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత సంపూర్ణ భారతీయ క్రైస్తవుడిగా జీవించడానికి ప్రయత్నించారు.

మహారాష్ట్రలో కొత్తగా మారిన మరాఠీ మాట్లాడే క్రైస్తవుల కోసం తిలక్ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక-సాంస్కృతిక ఉద్యమాన్ని రూపొందించారు.ఈనాటికీ మహారాష్ట్రలోని చర్చిలలో హార్మోనియం, తాళాలు మరియు తబలా వంటి సంగీత వాయిద్యాలతోపాటు తిలక్ యొక్క భజనలు మరియు అభంగ్‌లు పాడబడటం, మరాఠీ క్రైస్తవ సమాజానికి తిలక్ అందించిన గొప్ప సహకారం.


తిలక్ రచనలు

తిలక్ మేథో సంపత్తి పెద్ద సంఖ్యలో  అతను రచించిన కవితలు మరియు ఇతర సాహిత్య రచనలలో ప్రతిబింబిస్తుంది. రెవ. భాస్కర్ ఉజాగారే 1914లో ‘తిలకంచి కవిత’ (తిలక్ కవిత్వం) అనే పేరుతో 84 కవితల సంకలనానికి సంపాదకత్వం వహించారు. లోకమాన్య తిలక్‌కి అత్యంత సన్నిహితుడైన నరసింహ చింతామణి కేల్కర్ ఈ కవితా సంకలనానికి ముందుమాట రాశారు.

తిలక్ యొక్క ఇతర ప్రసిద్ధ రచన క్రైస్తవ బైబిల్ ఆధారంగా పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక ఇతిహాసం రూపొందించబడింది. ఇది ఇటాలియన్ జెస్యూట్ జోసెఫ్ బెస్చి అలియాస్ విర్మమునివర్ రాసిన తమిళ ఇతిహాసం ‘టెంబవాణి’తో మరియు 17వ శతాబ్దపు మరాఠీ ఇతిహాసం ఫాదర్  థామస్ స్టీఫెన్స్ రాసిన ‘క్రిస్ట్‌పురాన్’తో సారూప్యతను కలిగి ఉంది. ఫాదర్ బెస్చి మరియు ఫాదర్ స్టీఫెన్స్ ఇద్దరూ విదేశీయులు, వారు ప్రాంతీయ భాషలలో క్రైస్తవ ఇతివృత్తాల ఆధారంగా ఇతిహాసాలు రచించారు. తిలక్ ఇదే పద్ధతిలో ఒక ఇతిహాసం రచించిన మొదటి భారతీయ క్రైస్తవ మిషనరీ.

‘క్రిష్టయానా’(Christayana )

భారతీయ క్రైస్తవ ఆరాధనలు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోవాలని తిలక్ కోరుకున్నారు - ఐదు దశాబ్దాల తర్వాత రెండవ వాటికన్ కౌన్సిల్ ఈ సూత్రాన్ని నొక్కిచెప్పింది. ఆ ప్రయత్నంలో భాగమే ‘క్రిష్టయానా’ అనే ఇతిహాసం. తిలక్ 1910లో ‘క్రిష్టయానా’ రాయడం ప్రారంభించాడు. చాలా సార్లు, అతను తన ఇంటిని విడిచిపెట్టి, సతారా జిల్లాలోని పంచగని మరియు భుజ్ వంటి ప్రదేశాలలో నివసిస్తూ ఈ మిషన్‌కు పూర్తిగా అంకితమయ్యాడు. తన జీవిత చరమాంకంలో అతను అదే ప్రయోజనం కోసం తన కుటుంబంతో సతారా పట్టణంలో స్థిరపడ్డాడు. కానీ ఇతిహాసం పూర్తి చేయాలనే అతని కోరిక నెరవేరలేదు. అతను చనిపోయే ముందు 10 అధ్యాయాలు మరియు 11వ అధ్యాయంలో కొంత భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగాడు.

అతను మరణించిన పన్నెండేళ్ల తర్వాత - 1931లో - లక్ష్మీబాయి తన భర్త యొక్క అసంపూర్ణ పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తరువాతి ఐదేళ్లలో, ఆమె 64 అధ్యాయాలను జోడించింది. ఆమె మరణానంతరం, వారి కుమారుడు దేవదత్త ముగింపు 76వ అధ్యాయాన్ని రచించాడు. 1938లో ఎట్టకేలకు ‘క్రిష్టయానా’ అనే ఇతిహాసం ప్రచురించబడింది. దీనికి  ప్రముఖ కవి ఎస్ కె కనేత్కర్ సంపాదకత్వం వహించారు.

భజనలు పాడటం మరియు చర్చిలలో కీర్తనలు నిర్వహించడం వంటి భారతీయ ఆరాధనా విధానాలను పరిచయం చేయడంలో అతని  కాలంలో తిలక్ ఒక అరుదైన విజయం సాధించాడు. అతను అభంగాల సంకలనంపై తన పుస్తకానికి ముందుమాటలో ఇలా రాశాడు; "భజనలు పాడటం మరియు పురాణాల నుండి కథలు చెప్పడం అనేది మతాన్ని ప్రచారం చేసే సాంప్రదాయిక మార్గాలు. ఇవి ప్రజలచే ప్రశంసించబడతాయి మరియు సమర్థించబడతాయి." అతని ప్రయత్నాలు మహారాష్ట్రలో గొప్ప ఫలితాలను  అందించాయి. ఇప్పటికీ కాథలిక్ మరియు ప్రొటెస్టంట్ చర్చిలలోని విశ్వాసులు దీనిని అనుసరిస్తూనే ఉన్నారు

క్రైస్తవ మతంలోకి మారడం అంటే వేరే దేశానికి వలస వెళ్లడం కాదని, మతం మారిన తర్వాత కూడా ప్రజలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును నిలుపుకోవాలని తిలక్ అభిప్రాయపడ్డారు. అతను నిజంగా భారతీయ సంస్కృతిలో గర్వించదగిన జాతీయవాద మిషనరీ. తన జీవితంలోని తరువాతి సంవత్సరాల్లో పరిత్యాగానికి ప్రతీకగా ఊదా రంగు దుస్తులను మాత్రమే ధరించాడు .

అతను మతం మారడానికి ముందు, ఒక స్నేహితుడు తిలక్‌ని ఇలా అడిగాడు: “మీరు క్రైస్తవులైన తర్వాత మీ తీవ్రమైన దేశభక్తి అలాగే ఉంటుందా?” ఈ ప్రశ్నకు సమాధానంగా, తిలక్ ఒక పద్యం రచించారు, ఇది తిలక్ యొక్క దేశభక్తిని తెలియజేస్తుంది. మరాఠీ నుండి విస్తృతంగా అనువదించబడిన తిలక్ పద్యం చివరలో తన లోతైన భావాలను వ్యక్తపరిచాడు: “ఓ ప్రియ మిత్రమా! భూమిపై జీవించేటప్పుడు నేను ఏడవవచ్చు, కుంగిపోవచ్చు, కష్టపడి పనిచేయవచ్చు, కానీ నేను క్రైస్తవునిగా మారినప్పటికీ నా స్వంత దేశం కోసం చనిపోతాను. ఇలా చేయడం ద్వారా, నేను క్రీస్తు కృపను పొందుకుంటాను. లేకపోతే, నేను పేరు కోసం మాత్రమే క్రైస్తవుడిని.” తిలక్ ఈవిధంగా నమ్మాడు, “ఒక క్రైస్తవుడు క్రీస్తులా ఉండాలి. మరియు ఒక భారతీయ క్రైస్తవుడు ప్రాచ్య క్రీస్తు వలె ఉండాలి.

మరాఠీ క్రైస్తవ సాహిత్యం

19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా మరియు ఉత్తర మహారాష్ట్ర నుండి వందలాది కుటుంబాలు క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఉన్నత కులాల ప్రజలు వారిని అంటరానివారిగా పరిగణించడం కొనసాగించారు.

తిలక్ స్వరపరిచిన అభంగాలు లేదా మరాఠీ శ్లోకాలు తమ కొత్త మతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నూతన క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చాయి.  తిలక్ వంటి సంస్కృత పండితుడు చేసిన ఆధ్యాత్మిక కూర్పు కూడా గొప్ప సాహిత్య విలువను కలిగి ఉంది. అందుకే,  తిలక్ ప్రొటెస్టంట్ అయినప్పటికీ, అతని కీర్తనలు గత కొన్ని దశాబ్దాలుగా క్యాథలిక్ చర్చిలలో కూడా పాడబడుతున్నాయి.

తిలక్ 1912 నుండి 1919లో మరణించే వరకు ‘జ్ఞానోదయ’ అనే మరాఠీ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. 1842లో అమెరికన్ మరాఠీ మిషన్ స్థాపించిన ఈ పత్రిక నేటికీ ప్రచురింపబడుతూనే ఉంది.

పండిత రమాబాయితో కలిసి పరిచర్య

తిలక్‌ను ఒకసారి పండిత రమాబాయి తన గ్రామమైన పూణే సమీపంలోని కేద్‌గావ్‌లో ఉండమని మరియు బైబిల్‌ను మరాఠీలోకి అనువదించడంలో సహాయం చేయమని ఆహ్వానించింది. దాదాపు 1905లో, తిలక్ లక్ష్మీబాయి మరియు కుమారుడు దేవదత్తాతో కలిసి దాదాపు ఆరు నెలలు కేద్‌గావ్‌లో ఉన్నారు. ఆ సమయంలో   రమాబాయి తన 108 భజనల సంకలనాన్ని 'భజన సంగ్రహ' పేరుతో తన ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రచురించారు. ఆమె తర్వాత దాని రెండవ ప్రచురణను కూడా ముద్రించింది.

కేద్‌గావ్‌లోని పండిత రమాబాయి 'ముక్తి సదన్'లోని బాలికలకు భారతీయ శాస్త్రీయ సంగీత శైలిలో పాడే క్రైస్తవ కీర్తనలు నేర్పించాలని తిలక్ పట్టుబట్టారు. అతను అదే ప్రయోజనం కోసం 'భజన సంగ్రహ' నిర్మించాడు. తిలక్ సందర్శనకు ముందు పండిత రమాబాయి పాశ్చాత్య సంగీత శైలిలో కీర్తనలు పాడటం అక్కడి బాలికలకు నేర్పేది.

పండిత రమాబాయికి సంస్కృతంలో పూర్తి పరిజ్ఞానం ఉండేది. తిలక్ సంస్కృతం నేర్చుకున్నాడు కానీ భక్తి సమూహానికి చెందిన మరాఠీ సాధువుల  సాహిత్యం ద్వారా అతను మరింత ప్రభావితమయ్యాడు. అందుకే సంత్ తుకారాం కట్టించిన వంతెనపై నడిచి క్రీస్తు పాదాల చెంతకు చేరుకున్నానని చెబుతుండేవాడు. తిలక్ మరియు పండిత రమాబాయి యొక్క భిన్నమైన దృక్పథంతో బైబిల్ అనువాదం  చేయడం కష్టతరమయ్యింది. అందువల్ల, ఆరు నెలల్లోనే,  తిలక్ తన కుటుంబంతో సహా కేద్‌గావ్‌ నుండి బయలుదేరాడు. తిలక్ కేద్‌గావ్‌ను విడిచిపెట్టినప్పటికీ పండిత రమాబాయితో అతని స్నేహం కొనసాగింది. తిలక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతని చివరి రోజుల్లో, పండిత రమాబాయి తన కుమార్తె మనోరమ ద్వారా అతనికి 100 రూపాయలు పంపింది.

తిలక్ యొక్క సంకల్పం అతని అపారమైన దేశభక్తి మరియు భారతీయ సంస్కృతి పట్ల ప్రేమకు నిదర్శనం. తన భౌతికకాయాన్ని పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఖననం చేయకూడదని, భారతీయ సంప్రదాయం ప్రకారం జరిపించాలని, తన అంత్యక్రియల ఊరేగింపులో నలుపు రంగును నిషేధించాలని పట్టుబట్టారు. అతను ఇలా పలికాడు, “నా దగ్గరివారు మరియు ప్రియమైనవారు నా చితాభస్మాన్ని ఉంచే ప్రదేశంలో ఒక స్మారక చిహ్నాన్ని లేదా సమాధిని నిర్మించాలనుకుంటే, దానిపై ఈ క్రింది పంక్తులు చెక్కాలి: 'పుష్కల్ అజునీ ఉనా, ప్రభు మి, పుష్కల్ అజునీ ఉనా రే! ' (ఓ దేవా! నేను ఇంకా అసంపూర్ణంగా ఉన్నాను. దేవుడా! నేను ఇంకా అసంపూర్ణంగా ఉన్నాను!) నా పేరుకు 'రెవరెండ్' లేదా 'మిస్టర్' వంటివి జత చేయకూడదు. పేరును ఆంగ్లంలో N. V. తిలక్ అని కాకుండా నారాయణ్ వామన్ తిలక్ అని రాయాలి. నేను నా దేశాన్ని ప్రేమించినంతగా నా తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, స్నేహితులను లేదా నన్ను కూడా ప్రేమించలేదు.”

ముగింపు

తిలక్ ముంబైలోని J. J. హాస్పిటల్‌లో 9 మే, 1919న మరణించారు మరియు అతని అంత్యక్రియలను వర్లీ శ్మశాన వాటికలో నిర్వహించారు. అతని చితాభస్మాన్ని అహ్మద్‌నగర్‌కు తీసుకువెళ్ళి ఖననం చేసారు. తిలక్‌కి ఇష్టమైన మరాఠీ పద్యమైన ‘పుష్కల్ అజుని ఉనా’ మరియు కవి మాధవ్ జూలియన్ రాసిన కవితా నివాళి అతని స్మారక చిహ్నం వద్ద ఉన్న పాలరాతి ఫలకంపై చెక్కబడి ఉన్నాయి.


మహారాష్ట్ర ప్రభుత్వం 2019 లో  ఆయన శత వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించారు.  కానీ ఆయన తన సున్నిత భావాలతో అందించిన  తన కవితల ద్వారా జీవించే  ఉన్నారు. పువ్వులు, పక్షులు మరియు ప్రకృతిపై అతని కవితలు అతనికి గౌరవప్రదమైన, 'ఫూలా-ములంచె కవి' (పువ్వులు మరియు పిల్లల కవి)అనే పేరును సంపాదించిపెట్టాయి. మహారాష్ట్రలోని మరాఠీ మీడియం పాఠశాలల విద్యార్థులు  తిలక్ వ్యక్తిత్వం గురించి ఆయన సతీమణి లక్ష్మీబాయి తిలక్ 'స్మృతిచిత్రే' (జ్ఞాపకాలు) పేరుతో రచించబడిన ఆత్మకథ నుండి సంగ్రహించబడిన కొన్ని పాఠాల ద్వారా తెలుసుకుంటున్నారు.

నేటికీ, నారాయణ్ వామన్ తిలక్ మహారాష్ట్రలోని అత్యంత గొప్ప క్రైస్తవ రచయితలలో ఒకరిగా కీర్తించబడుచున్నారు. తిలక్ మరియు అతని భార్య లక్ష్మీబాయి వ్యక్తిత్వాలు అక్కడి  ప్రజలను ఇంకనూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. వారి జీవితాలు మరియు రచనల ఆధారంగా అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి. వారి జ్ఞాపకాలు క్రైస్తవ మరాఠీ సమాజంలో ఎన్నటెన్నటికీ సజీవంగానిలిచే ఉంటాయి.





Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews