ప్రొటెస్టంట్ (Protestant) ఉద్యమము యొక్క ఆవిర్భావము మరియు ఎదుగుదలకు కారణము ఒక వ్యక్తి యొక్క విశ్వాసము. అతడే మార్టిన్ లూథర్. మధ్యయుగపు సంఘము ఎంతో అసంతృప్తితో నిండి వున్నప్పటికి చివరకు పోపు యొక్క అధికారముపై లూథర్ సవాలు యూరప్ నందలి క్రైస్తవ మతము యొక్క సంస్కరణకు నాంది పలికింది. అంతకు మునుపు ఎంతోమంది ఎదిరించినప్పటికిని, పాప పరిహార పత్రాల యొక్క విక్రయముపై లూథర్ జరిపిన దాడి సామాన్య మానవుని కూడా ఆకర్షించి వారిని అనుకూలముగా స్పందింపజేసినది.
బాల్యము- విద్యాభ్యాసము
ఒక గనిలో పనిచేసే కార్మికుని కుమారుడైన లూథర్ తురింగియా (Thuringia) లోని ఐస్బన్(Eisleben) అను గ్రామములో జన్మించాడు. దృఢనిశ్చయం, స్వతంత్ర భావాలు గల వ్యక్తి ఐన అతని తండ్రి ఆరు గనులు మరియు రెండు పౌండరీలకు భాగస్తుడిగా వృద్ధిచెందాడు. అతడు ఆ పట్టణమునకు కౌన్సిలర్ (Councillor) గా పదవిని నిర్వర్తించాడు. పట్టణము మధ్యలో ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. చిన్నవాడైన మార్టిన్ 'కతోలిక్ మత సంప్రదాయ ప్రకారముగా మూఢనమ్మకములతో, దుష్టశక్తుల భయముతో, నిత్యత్వాన్ని ధిక్కరిస్తూ, పాప పరిహార రుసుము చెల్లించుచూ, మంచి పనులు చేయువారే పరలోకము నందు స్థానము పొందగలరను నిరీక్షణతో పెంచబడ్డాడు. అప్పటి ప్రజలు సత్యాన్ని అనుసరింపక సంప్రదాయాలకు విలువనిస్తూ సంఘ సిద్ధాంతాలను ఆచరించిన వారే రక్షణ పొందగలరను గ్రుడ్డి నమ్మకముతో వుండేవారు.
1501వ సం॥ లో మార్టిన్ పద్దెనిమిదవ ప్రాయమున, అతని తండ్రి పురాతన విశ్వవిద్యాలయములో ఒకటైన ఎర్ ఫర్ట్ (Erfurt)కు మార్టిన్ ను పంపాడు. అక్కడ అతడు ఆర్ట్స్ విభాగము నందు పట్టా అందుకున్నాడు. మొదట న్యాయవాద వృత్తిని చేపట్టవలెనని తలంచాడు కాని ఒక నాడు అతని స్నేహితుడు పైన అకస్మాత్తుగా పిడుగుపాటు వలన మరణించుట అతని జీవితగతిని మార్చివేసింది. లూథర్ ఈ సంఘటనతో బహుగా కలత చెందాడు . అతడు న్యాయవాది కావలెనను తలంపును విడచి, తన తండ్రి చిత్తానికి వ్యతిరేకముగా ఎర్ ఫర్ట్ నందలి ఐదు సన్యాసుల ఆశ్రమము (Monasteries) లలో ఒకటైన ఆగస్టీనియన్ హెర్మిట్స్ (Augustinian Hermits) నందు చేరాడు.
అతడు 1505లో ఒక క్రొత్తవానిగా (Novice) సన్యాసత్వమును స్వీకరించాడు. శిక్షణకాలములోనే బోధించుటయందు అతనికి వున్న సమర్థతను గుర్తించిన అధికారులు అతనిని ఉన్నత స్థితికై ప్రోత్సహించారు. 1507లో అతడు మత గురువుగా అభిషేకింపబడ్డాడు. విట్టెన్ ్బర్గ్ (Wittenberg) విశ్వవిద్యాలయమునందు (Moral Philosophy) నీతి తత్త్వ శాస్త్ర భోధకునిగ కూడా నియమింపబడ్డాడు. 1512లో వేదాంత గురువుగా నియమింపబడి తన జీవితాంతము వరకు అందులోనే కొనసాగాడు. విశ్వవిధ్యాలయములో అతడు ఎంతో సమయము పరిశోధనలలో గడిపేవాడు. అతడు అపోస్తులుడైన పౌలును గూర్చి బోధించుచు, ప్రతిదినము పారిష్ చర్చ్ నందు బోధించుచూ, అనేక పత్రికలను కూడా రచించాడు. తరువాత క్రొత్త నిబంధనను తన స్వంత భాషలో చదవాలనే కోరికతో గ్రీకు భాషను అభ్యసించాడు.
లూథర్ బయటకు ఒక మేథావివలె అపారజ్ఞాన సంపన్నునిగా కనబడినప్పటికిని అతని మనస్సలో అనేక జవాబులు లేని ప్రశ్నలు అతనిని లోలోపల కలచివేసేవి. తన ముందు వున్న అనేక మంది వలె అతడు కూడ తన జీవితమును దేవుని యెదుట సరిచేసుకొన్నాడు , కాని సాధారణ పద్ధతులైన ప్రాయశ్చిత్తము, ఒప్పుకోలు, ప్రార్థనలు, ఉపవాసము మరియు జాగరణలు తాను ఆశించిన శాంతిని అతని హృదయమునకు ఇవ్వలేకపోయాయి.
తీర్థ యాత్ర
అతడు రోమ్ తీర్థ యాత్రకు వెళ్లాడు. అక్కడ అతనికి పాపములను ప్రాయశ్చిత్తము చేసికొనుటకు మరియు పూజ జరిగించుటకు అవకాశమియ్యబడింది. అచ్చట గురువు యొక్క ఉపదేశమును పొందాడు. కాని ఫలితము కానరాలేదు. అచట గల స్కాల సాంక్ట (Scala Sancta) యొక్క 28 మెట్లు ఎక్కి వెళ్లాడు. అది యేసుక్రీస్తునకు తీర్పు తీర్చిన పొంతి పిలాతు గృహము యొక్క సోపానము దాని యొక్క ప్రతి మెట్టుపై జపమును వల్లించిన ప్రాయశ్చిత్తము కల్గునను మూఢనమ్మకముతో ఆవిధముగా చేసినను రక్షణ నిశ్చయత కలుగలేదు.
అతనికి ఆ మెట్లు ఎక్కుచుండగా అతనికి హబక్కూకు గ్రంథము నుండి ఈ వచనము మదిలో స్ఫురించింది. "నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.", కాని అతని అంతరాత్మ ,ఈ సత్యమును నేనెలా తెలిసికొనగలను ? అను సవాలును విసిరింది.
శాంతిని పొందుటలో విఫలునిగా అతడు జర్మనీ దేశమునకు తిరిగివచ్చాడు. సంఘము దేవుని రాజ్యము యొక్క తాళపుచెవిని మరచినదనే విషయాన్ని అతడు దృఢముగా నమ్మాడు. అతడు ఈ విధముగా పలికాడు - "నేనొక అవివేకి వలె ఉల్లిపాయలను రోమ్ దేశమునకు తీసికొని వెళ్ళి, వెల్లుల్లితో తిరిగి వచ్చాను.”
పాపము వలన దోషిగా నిర్ధారింపబడిన వాడై లూథర్ తాను దేవుని తీర్పు ఎదుట నిలువబడలేని వాడుగా, నేరస్తునిగా, పాపిగా తీర్మానించుకొన్నాడు. విశ్వవిద్యాలయము నందలి అతని గురువైన స్టాపిట్జ్ (Staupitz) అను తత్యవేత్త లూథర్ యొక్క మనస్సును దేవుని యొక్క క్షమాపణ, దయలవైపు మళ్ళించుటకు ప్రయత్నించాడు. కాని దేవుని యొద్ద నుండి రక్షణ పొందవలెనన్న బహుగా శ్రమపడవలసినదేనని అతడు ఉపదేశించాడు. ఈయన ఉపదేశములతో లూథర్ కొద్దిగా వూరట పొందాడు. 1513లో అతడు కీర్తనలలో ఒక అంశాన్ని బోధించుటకు సిద్ధపడుచుండగా అతనికి ఎంతో సుపరిచితమైన వచనము నందు తన ప్రశ్నకు జవాబు లభించింది. 'నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము’(కీర్తనలు 31:1)అని అక్కడ వ్రాయబడి వున్నది.
పాప పరిహార పత్రములు
సంఘములోని తప్పుడు సిద్ధాంతాలను మరియు ఆచారాలను సవాలు చేయుటకు క్రొత్తగా జన్మించిన లూథర్ కు నాలుగు సంవత్సరములు పట్టింది. అప్పటి సంఘము తన అతిలాలసత్వాన్ని పోషించుటకు రోమ్ నందలి పరిశుద్ధ. పేతురు భవనమును తిరిగి నిర్మించుటకు డబ్బుప్రోగు చేయవలెనని నిశ్చయించినది. మద్యయుగపు మానవులు తమ పాపములను త్వరగా ప్రాయశ్చిత్తము చేసికొన వలెనని ఆతురతతో పాపరిహార పత్రాలను కొనుగోలు చేయనారంభించారు. వీటి వలన పరలోకమునకు ప్రవేశించుటకు సులభ మార్గములైన పాపపు ఒప్పుకోలు, క్రీస్తు నందలి విశ్వాసమును ప్రక్కకు నెట్టివేయబడినవి.
పోపు ప్రతినిధి యైన టెట్బెల్ (Tetzel) అను నతడు విటెన్ బర్గ్ సమీపములోని పట్టణాన్ని దర్శించి పాపములన్నిటికై పరిహారమునకు గాను, మరియు చనిపోయిన తమ బంధు మిత్రులను సరాసరి పరలోకమునకు తీసుకొని వెళ్ళుటకు పాప పరిహార పత్రాలను విక్రయించుచుండగా లూథరుకు తాను పనిచేయుటకు అది సరియైన సమయముగా తోచెను
1517లో జరిగిన సకల పరిశుద్దుల పండుగ సాయంకాలం నందు అతడు విఖ్యాతి గాంచిన అతని 95 సిద్ధాంతములను విటెన్ బర్గ్ నందలి కాసిల్ చర్చ్ (Castile church) యొక్క తలుపునకు దిగగొట్టెను. అందులో అతడు పాప పరిహార పత్రాల విక్రయాన్ని ఖండించెను. అతడు ఆర్చ్ బిషప్ మరియు బిషప్ లకు కూడా వాటి ప్రతులను పంపెను. వారు వాటిని చదివి ఏ విధముగా ప్రతిస్పందించెదరో అని లూథర్ గమనింపసాగెను. లూథర్ యొక్క చర్యలు ఏమాత్రము అసాధారణమైనవి కావు గాని అవి తన ప్రసంగాలలో సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో సంఘమునకు తన అభ్యం తరములను తెలియజేసెడివిగా వున్నాయి.
లూథర్ తన జీర్ణవ్యవస్థలో వచ్చిన అస్వస్థతతో బాధపడుచున్నను ఆక్స్ బర్గ్ కు ప్రయాణమయ్యాడు. చివరి మూడు మైళ్ళు ఒక బండిపై ప్రయాణము సాగించాడు. తన అభిప్రాయము మార్చుకొని తప్పుడు బోధనలు ఇకపై చేయకుండునట్లు పోప్ ఆజ్ఞాపించగలడని తనకు ఎంతో నమ్మకమైన కార్డినల్ కజటాన్ (Cardinal Cajetan) ద్వారా తెలిసికొన్నాడు. లూథర్ తాను అయితే బైబిల్ కు విరుద్ధముగా ఎటువంటి బోధనలనూ చేయుటలేదని పేర్కొనుచూ బహిరంగముగా చర్చించుటకు ఇష్టపడ్డాడు. ఈ వివాదమువలన పరిస్థితులు విషమించి లూథర్ వెలివేయబడవచ్చునను భయమును కజెటాన్ వెలిబుచ్చాడు. లూథర్ ను బలపరచే అనేకులు అతని క్షేమము విషయమై భయపడసాగిరి. వారు లూథర్ రహస్యముగా మరణానికి లోనవుతాడేమోనను భయముతో తిరిగి అతనిని విటెన్ బర్గ్ నకు తీసుకొని వచ్చారు.
సంస్కరణ కొరకు పోరాటము
లూథర్ సంస్కరణ చేపట్టు యుద్ధములో ఒక ప్రాముఖ్యమైన దశకు వచ్చాడు. అతడు పోపు యొక్క అధికారమును ధిక్కరించుటేగాక అతని సభను తప్పుడుదిగా జమకట్టెను. రాజకీయ నాయకులు కూడా జర్మనీ దేశమును రోమ్ నుండి స్వతంత్రపరుచుటకు గల లాభాలను యోచింప సాగిరి. మత. సంబంధమైన స్వాతంత్రమే గాక, జర్మనీ దేశము యొక్క స్వాతంత్య్రత ప్రధానంశమైనది.
ముద్రణా యంత్రము యొక్క ఆవిష్కరణ (1455లో గుటెన్ బర్గ్ చే కనుగొనబడినది. అతడు బైబిల్ ను హీబ్రూ, లాటిన్ భాషలలోనికి అనువదించెను) లూథర్ అనేక కరపత్రములు, గ్రంథములు రచించుటకు సహాయపడెను. 1520లో అతడు విశ్వ విఖ్యాతిగాంచిన మూడు కరపత్రములను ప్రచురించెను. తరువాత అనేక వేదాంత గ్రంథాలను, బైబిల్ కామెంటరీలను అనేక ఆధ్యాత్మిక ప్రచురణలను ముద్రించెను. తన 40 సం॥ వయస్సునుండి (1523) ప్రతి రెండు వారాలకు ఒక పుస్తకము ప్రచురింప సాగెను.
జూలై మాసము 1520లో ఎక్ గారికి ప్రేరేపణ ద్వారా Papal bull (పోపు ఆజ్ఞ ఎరుపు రంగుతో ముద్రచేయబడినది ) రోమ్ నుండి ఒక ఖండితమైన శిక్ష జారీ చేయబడినది. అదేమనగా లూథర్ రచనలు అన్నియు తగుల బెట్టవలెను. మరియు అతని అనుయాయుల నందరిని బహిష్కరింపవలెను. అతడు బహిరంగముగా క్షమాపణ చెప్పుకొనుటకు 60 దినములు గడువు ఇయ్యబడింది. ఈ ఆజ్ఞకు జర్మనీ దేశములో మిశ్రమ స్పందన లభించెను. అనేక పట్టణములు దీనిని సమ్మతింపలేదు. అతని పుస్తకములు అగ్నికి ఆహుతి చేయుటలో కూడా కొద్దిపాటి విజయము మాత్రము లభించినది. మైంజ్ (Mainz) అను స్థలమునందు ఒక నిరాక్షరాస్యుడైన సమాధులు త్రవ్వేవానికి ఈ పనిని అప్పగించిరి. దీనికి బదులుగా 50 మంది విద్యార్థులు లూథర్ కు వ్యతిరేకముగా వేసిన కరపత్రములను కాల్చివేసారు.
డిసెంబర్ పది, ఉదయం 9గం|| విటెన్బర్గ్ నందు లూథర్ తన తోటి అధ్యాపకులు మరియు కొంతమంది విద్యార్థులతో కలిసి సంఘము యొక్క రచనలను ధర్మనియమాలను మరియు ఎక్ గారితో జరిపిన సమావేశపు తాలూకు కాగితములను కాల్చివేసారు. లూథర్ ఒక అడుగు ముందుకు వేసి బహిరంగముగా పోపు ఆజ్ఞాపత్రాన్ని (Papal bull) మంటలలోకి విసిరివేసి పోపు యొక్క అధికారాన్ని వ్యతిరేకించుచున్నట్లుగా తెలియజేసాడు.
సాధారణ రీతిగా నైతే ఈవిధంగా చేసినందులకు లూథర్ ను అరెస్టు చేసి ఉరితీసియుండెడివారు. కాని Elector గా వున్న ఫ్రెడెరిక్ లూథర్ జర్మనీలో న్యాయస్థానము యెదుట తీర్పు తీర్చబడాలని బలవంతము చేసాడు. అప్పటి పరిపాలకుడు, యువకుడైన చక్రవర్తి ఛార్లెస్ V, స్పెయిన్ దేశపు రాజు. కాథలిక్ మతాభిమాని అయిన ఇతడు వోమ్స్ (Worms) నందు తనను కలువవలసిందిగా (April 1521) ఒక రాజాజ్ఞను లూథర్ నకు పంపించాడు. అతడు సంఘము యొక్క ఏకత్వాన్ని కోరి ఈ ఉద్యమమును అణచివేయాలని భావించాడు.
నేను ఇక్కడ నిలబడి వున్నాను "Here I stand”
లూథర్ యొక్క భద్రత నిమిత్తమై ఒక బండిని ప్రయాణముల కొరకై సిద్ధము చేసినప్పటికిని అతని స్నేహితులు అతనిని నివారించారు. వోమ్స్ లో ఎంతమంది దయ్యములు వున్నప్పటికిని నేను అక్కడికి ప్రవేశించెదను” అని లూథర్ బదులిచ్చాడు. మార్గమంతటిలో అతనికి ప్రజల నుండి గొప్ప ఆదరణ లభించింది. అతని ప్రసంగము వినుటకు అనేకులు వచ్చారు. అతనిచే ఉద్యమము కొనసాగనివ్వ కుండా చేయవలెననే శత్రువుల పన్నాగాలు నిరుపయోగమైనవి. చక్రవర్తి ఎదుటకు లూథర్ తేబడినపుడు అతనికి ఒక పుస్తకముల కట్ట ఇచ్చి వాటిని తక్షణమే త్యజించవలసినదిగా కోరిరి. అతడు వారిని కొంతసమయము అడిగాడు. తరువాతి దినము అతడు కౌన్సిల్ వారికి తాను తప్పు చేసినట్లు లేఖనములను ఆధారము చేసికొని, సరైన కారణములు చూపవలెనని దేవుని వాక్యములో తనను తాను బంధించుకొని ఆత్మ పరిశీలన గావించుకొనుటకు తాను సిద్ధముగా నున్నానని పలికెను. రాజు ఎదుట అతడు ఈ విధముగా పలికెను - 'నేను ఏమియూ చేయలేను. నేను ఇక్కడ నిలువబడియున్నాను. దేవుడు నాకు సహాయము జేయును గాక'
లూథర్ ను ఖండించుటకు చక్రవర్తి చేసిన ప్రయత్నము తప్పిపోయెను అతడు విట్టెన్ బర్గ్ కు చేరుటకు 21 రోజులు గడువిచ్చిరి. అటు పిమ్మట అతని రాజ ధిక్కారము చేసిన వ్యక్తిగా వ్యవహరిస్తూ బహిష్కరించారు. చక్రవర్తిచే నిరాకరింపబడిన వ్యక్తిగా వుంచబడ్డాడు. అనగా అతని మిగిలి జీవితమంతయూ ఒంటరి జీవితము జీవించునట్లుగా కట్టుబడి చేసారు. తరువాతి ఉదయము ఇరువది ముఖ్యమైన వ్యక్తులతో అతడు విట్టెన్ బర్గ్ తరలించబడ్డాడు. వారు తమ గమ్యస్థానము చేరు లోపల లూథర్ త్వరితముగా తన హెబ్రీ పాతనిబంధన గ్రంథమును మరి గ్రీకులోని క్రొత్త నిబంధనను తీసికొని వార్ట్ బర్గ్ (Wartburg) కోట లోనికి వెళ్ళి తలదాచుకొన్నాడు. చాలా కాలము వరకు అతని శత్రువులు అతడు సంహరింపబడెనని భావించిరి. కాని అతడు Elector యొక్క కాపుదలలో సురక్షితముగా వున్నాడు.
అతడు చెర పట్టబడిన కాలములో, లూథర్ తన సమయమును క్రొత్తనిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోనికి అనువదించుటకు వినియోగించాడు. 1534 న అతడు బైబిల్ ను అనువదించుట పూర్తి చేసాడు. చివరకు అతడు ఆ కోటను విడిచి విట్టెన్ బర్గ్ కు వెళ్ళుట అవసరమని భావించాడు. అక్కడి యవ్వన సౌవార్తిక సంఘము కష్టములలో వున్నదని విని తన అనుయాయులలో కొంతమంది విపరీత బోధనల లోపముతో కష్టములను ఎదుర్కొనుచున్నారనియు మరియు దాని యొక్క నిర్వహణ సక్రమముగా లేదని తెలిసికొన్నాడు . వారము లోపలే, లూథర్ అక్కడి సమస్యలన్నిటిని సరిచేసాడు. ప్రవక్తలుగా తమను తాము చెప్పుకున్న వారంతా ఆ పట్టణమును వదిలిపెట్టి వెళ్లారు.
లూథర్ విట్టెన్ బర్గ్ నందు, ఫ్రెడెరిక్ యొక్క సంరక్షణలో క్షేమముగా నుండెను. సంస్కరింపబడిన మతము ఇతర పట్టణాలకు, నగరాలకు వ్యాపించే కొలది అనేక మంది యువరాజులు అందులో చేరి సౌవార్తిక సంఘము ఎదుగుటకు కృషిచేశారు. సంఘ విశ్వాసము మరియు సిద్ధాంతమును సంస్కరించుటలో నిమగ్నుడైనప్పటికిని లూథర్ కేథలిక్ మత సంప్రదాయములైన చర్చి భవనాలు, దుస్తులు, క్రొవ్వొత్తులను (Candles) మరియు సిలువలను గౌరవించాడు.
సంస్కరణలు
లేఖనముల ముఖ్య వుద్దేశము, క్రీస్తు వలన రక్షణను గూర్చిన సిద్ధాంతములను పునరుద్ఘాటించుచూ అతడు ఆరాధనలో కొన్ని మార్పులను చేసాడు మరియు ఒక దివ్య ఆరాధనను ప్రతిపాదించాడు. అందులో బైబిల్ పఠనాన్ని మరియు వ్యాఖ్యానాన్ని ఉద్ఘాటించాడు. తాను మార్చిన ఆరాధనకు ఒక రూపము కల్పిస్తూ, సామాన్యముగా మరియు సిద్ధాంత పరమైన పవిత్రతతో నిండినదై వుండునట్లు రూపొందించాడు. (ఆంగ్లికన్లు ఆచరించు విధానము) కాకుండా అతడు సంఘ బోధకులకు ఒప్పుకోలు, వివాహము మొదలగు సందర్భాలలో వుపయోగించు ఆరాధనా క్రమము మరియు కీర్తనలతో కూడిన ఒక ఆరాధనా పుస్తకము – అందులో విశ్వ విఖ్యాతి గాంచిన (A Safe Stronghold Our God is Still) 'మా కర్త గట్టి దుర్గము’ కీర్తనను రచించెను. ఈ కీర్తనను ప్రొటెస్టంట్ ఉద్యమమునకు యుద్ధగీతికగా భావిస్తారు.
ఈ ఉద్యమమును అణచివేయుటకు ఛార్లెస్ చక్రవర్తి తన ప్రయత్నాలను మానలేదు. స్పేయర్ (Speyer) నందు 1526లో ఒక సమావేశము ఏర్పాట చేసాడు. అక్కడ ఆశ్చర్యరీతిలో లూథర్ నకు అనుకూలముగా వచ్చింది (చార్లెస్, పోప్ ల మద్య వివాదాల కారణముచే), జర్మనీలోని ప్రతి రాష్ట్రము అక్కడి రాజు యొక్క మతమును చేపట్ట వచ్చును.
రెండవ సమావేశము 1529లో సంఘమును ఏకము చేయుటకు మరియు టర్కీవారి నుండి దాడులను ఎదుక్కొనుటకు ప్రతిపాదనలు చేయుటకు గాను ఏర్పాటు చేయబడినది. లూథర్ తన గ్రంథములో చక్రవర్తికి క్రైస్తవ లోకాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకత వున్నదనియు దీనిని జర్మనులు అందరు బలపరచాలని వ్రాసాడు. కౌన్సిల్ లోని కేథలిక్కులు సంఘ కార్య కలాపాలపై తమ దృష్టిని నిలిపారు. సంస్కరింపబడిన ప్రాంతాల వారు మినహాయించి మిగిలిన రాష్ట్రాలలోని వారు కేథలిక్ మతములోనే వుండాలని నిశ్చయించారు. దీని మూలముగా మతోద్ధారణ వ్యాప్తి చెందదని తలంచారు. సౌవార్తిక సంఘములోని లూథర్ వారసుడైన (Melanchthon) మెలానక్తన్ దీనిని త్రోసి పుచ్చాడు. వీరు ఈ నిర్ణయమును వ్యతిరేకించి దేవుని వాక్యము మరియు మనస్సాక్షికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వవలసినదిగా నొక్కిచెప్పారు.
క్రొత్త ఉద్యమము
స్పెయర్ (Speyer) నందు సౌవార్తికులచే ప్రారంభమైన తిరుగుబాటు వలనే 'ప్రొటెస్టంట్' అను పదము వాడుకలోనికి వచ్చినది. మతోద్దారణ జర్మనీ అంతటా హద్దులు లేకుండ విస్తరించింది . మిగిలిన ప్రొటెస్టంట్ గుంపులు కూడా బయటకు వచ్చాయి. వారిలో ఆనా బాప్టిస్టులు (Anabaptists) వీరు విశ్వాసులు బాప్తీస్మమును మాత్రమే సమర్థించుచూ, లూథర్ తో 1521 విట్టెన్ బర్గ్ నందు విడిపోయారు. జ్యూరిచ్ (Zurich) నందలి జ్వింగ్లి (Zwingli) మరియు అతని అనుచరులు కూడా వేరొక గుంపుగా ఏర్పడ్డారు. వారు సువార్తను అధికారానికి ఆయువుపట్టుగా భావించారు. లూథర్ మరియు జ్వింగ్లి మధ్య విభేదాలు తొలగించుటకు చేసిన ప్రయత్నాలు సఫలము కాలేదు. రొట్టెవిరచుట, మరియు ద్రాక్ష రస సంస్కారము, వానిని పవిత్రముగా భావించు విషయలో మరియు రొట్టె, రసముల రూపములో, క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తములున్నవను లూథరుయొక్క విశ్వాసము విషయమై జ్వింగ్లి వీరిరువురు విభేధించిరి. మెలానక్తన్ చే 1530 వ సం. లో The Confesion of Augsburg నందు సంస్కరింపబడిన విశ్వాసము యొక్క ముఖ్య విషయములు పొందుపరచబడినాయి. అది లూథరనలు అవలంభించు విశ్వాస ప్రమాణముగా మారింది.
క్రమేణ లూథర్ యొక్క వ్యక్తిగత జీవితము కూడా సంస్కరింపబడెను. అతడు సన్యాసము నుండి తిరిగి వచ్చి పూర్వము మఠ కన్యకగా నున్న కేథరిన్ వాన్ బోరా అను ఆమెను భార్యగా స్వీకరించెను. వీరు ఎంతో చక్కని వివాహ జీవితమును గడిపిరి. వారికి ఆరుగురు సంతానము మరియు నలుగురు అనాథలను దత్తత చేసికొనిరి. అతడు కుటుంబ పరముగా తన సంతోషమును పిల్లలతో పంచుకొనుచూ వారికి బోధించుచూ సంగీతమును నేర్పుచూ గడిపెను. అతడు ఎంతో దయగలవాడు మరియు దానశీలి. ఎప్పుడు చక్కని ఆతిధ్యమును ఇచ్చేవాడు.
క్రుంగిపోవుట మరియు ఉల్లసించుట వంటి అనేక మనోభావాలు లూథర్ కూడా కలిగియుండేవాడు. రైతుల యుద్ధము జరిగినప్పుడు శాంతికై ప్రయత్నించాడు. అది విఫలమైనప్పుడు అతడు న్యాయాధికారులతో వారిపై కఠినమైన చర్యలు తీసుకొనవలసినదిగా కోరాడు. రైతుల వధ జరిగి పరిస్థితులు భీతికరముగా మారెను. రోమన్లు ఈ నిందను సంస్కర్త అయిన లూథర్ మీదికి నెట్టారు. ఆదేవిధముగా యూదులకు వ్యతిరేకముగా వ్రాశాడు అని కూడా చరిత్ర చెబుతుంది.
ముగింపు
లూథర్ లో అనేక తప్పులు వున్నను, అతడు మన మధ్యకు వచ్చిన గొప్ప దైవజనులలో ఒకడు. తన జీవిత కాలమంతయు సువార్తలలో చెప్పబడిన విధముగా సంఘాన్ని సంస్కరించుటకు తన సమయాన్ని వెచ్చించాడు. ఎంతో అస్వస్థతో వ్యాకులతతో నిండిన లూథర్ తన భార్యను చూచుటకై ప్రయాణించుచూ ఐస్బన్ (Eisleben) లో మరణించాడు. అతడు తన తుదిశ్వాస విడచుచు నప్పుడు అతడు యోహాను3:16 తన పరిశోధన మరియు జీవితము యొక్క పునాది యైన ఆ వాక్యభాగాన్ని పదే పదే విన్నాడు. లూథరనిజమ్ (Lutheranism) జర్మనీ నుండి (Scandinavia) స్కాండినేవియాకు వ్యాపించినది. అక్కడ అది ప్రభుత్వపు సంఘముగా గుర్తింపబడినది. స్వీడన్ లో కూడా ఈ మతోద్దారణ కలిగినది. కాని మధ్యయుగపు సంప్రదాయాల నుండి అంత సులభముగా సంబంధాలు తెంచుకోలేదు. మరియు వారి భావనలు ఫ్రాన్స్, హాలండ్, స్కాట్లాండ్ వరకు వ్యాపించాయి
No comments:
Post a Comment