Monday, 25 November 2024

జెఫన్యా - చీకటిలో వెలుగు


 జెఫన్యా పరిచయం : 

హెబ్రీ భాషలో జెఫన్యా అనే పేరుకు ‘ యెహోవా కాపాడతాడు ‘ అని అర్ధం. జెఫన్యా ఒక రాజకుటుంబం నుండి వచ్చాడు. జెఫన్యా 1:1 లో తన వంశవృక్షం లోని నాలుగు తరాల వారిని గూర్చి ప్రస్తావించాడు. యుదా రాజైన హిజ్కియా ( క్రీ.పూ 716 – 687) ముదిమనుమడు జెఫన్యా. ఇతనికి యెరూషలేములోని రాజమందిరపు అలవాట్లు, రాజకీయ వ్యవహారాలు అన్నీ సుపరిచితం. జెఫన్యా జీవించిన కాలంలోనే నహూము, యిర్మియా ప్రవక్తలు కుడా జీవించి ఉండవచ్చు.

జెఫన్యా నివసించిన కాలం :  

రాజైన యోషీయా పరిపాలించిన కాలంలో క్రీ.పూ 640 – 609 సంవత్సరాలలో జెఫన్యా జీవించాడు. యూదాను పరిపాలించిన మంచి రాజులలో యోషీయా చివరివాడు. దేశాన్ని దేవుని వైపు త్రిప్పడానికి ఎన్నో బలమైన ప్రయత్నాలు చేశాడు. యోషీయా కాలంలోనే ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడింది. దానిని చదివిన యోషీయా అనేక సంస్కరణలకు పూనుకున్నాడు(2 రాజులు 22:1 – 23:25). అతడు చేసిన సంస్కరణలు జెఫన్యాను కూడా ప్రభావితం చేసివుండవచ్చు.

తన 8 వ ఏట యోషీయా రాజై, 31 సంవత్సరాలు యుదా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తల్లి యెదీదా. అతడు యెహోవా దృష్టికి యదార్ధముగా నడిచాడు. అతడు శిథిలమైన యెహోవా మందిరాన్ని బాగుచేయాలని తలంచాడు. ఆ సమయంలో ప్రధానయాజకుడైన హిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. యోషీయా ఆ గ్రంథాన్ని చదివాడు. హుల్డా ప్రవక్తి సహాయంతో గ్రంథంలో చెప్పబడిన విషయాలను గ్రహించి ప్రజలకు వాటిని వివరించాడు. యెహోవా కట్టడలను  హృదయపూర్వకంగా గైకొంటానని యెహోవా సన్నిధిలో వాగ్థానం చేశాడు. ఇతర దేవతలను నాశనము చేసి వాటిని పూజించడానికి ఉపయోగించిన ఉపకారణాలన్నిటినీ యెహోవా ఆలయములో నుండి తెచ్చి నాశనము చేశాడు. విగ్రహారాధనను సమూలంగా నిర్మూలించిన పిమ్మట ప్రజలందరూ పస్కా పండుగను ఆచరించాలని ఆజ్ఞాపించాడు. యోషీయా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ధర్మశాస్త్రము చొప్పున ప్రవరించాడు. యోషీయా ఐగుప్తు రాజైన ఫరో నెకో చేతిలో మెగిద్దో దగ్గర చంపబడ్డాడు. యోషీయా మరణానికి ముందే జెఫన్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. తాను యూదా మీదకు తేనున్న తీర్పును యెహోవా బయలుపరిచాడు.

జెఫన్యా కాలం నాటి పాపాలు : 

1. ఏకీకరణ వాదము (జెఫన్యా 1:5 – 9) : ఇశ్రాయేలీయులు వాగ్థానభూమిని చేరిన తరువాత అక్కడ ఉన్న అన్యులందరిని వెళ్ళగొట్టాలని వారి దేవతలను పూజించరాదని యెహోవా దేవుడు వారిని ఆజ్ఞాపించాడు. కాని వారు కనానీయులు దేవతలను పూజించటం మొదలుపెట్టారు. వారి దేవతలలో ముఖ్యమైన బయలు దేవతను (సంతానోత్పత్తి కొరకు) వారు పూజించసాగారు.  ఆకాశ సమూహాలకు మొక్కడం అలవాటు చేసుకున్నారు. నిర్గమకాండం 20::3 లో “ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ” అని యెహోవా దేవుడు  ఇచ్చిన ఆజ్ఞను విస్మరించారు. యెహోవా దేవునితోపాటు అనేక దేవుళ్ళను మరియు దేవతలను పూజించసాగారు.

2. నిర్లక్ష్యము (1:12) : వారు దేవుని యెడల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. “ యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాదు” అని  వారు తమ మనస్సులో అనుకొన్నారు. 

3. బలాత్కారము / మోసము (1:8) :  యూదా అధికారులు, రాజకుమారులు ఇతర దేశాల వస్త్రధారణను అనుకరిస్తూ , ప్రజలపట్ల  మోసముతో, బలాత్కారముతో వారిని దోచుకోసాగారు.

4. ధనాశ (1:11,13) : వారు ద్రవ్యమును సమకూర్చుకొనుటకును, ఇండ్లు, ఆస్తులు కూడబెట్టుటయందును, ద్రాక్షతోటలు నాటించుటయందును నిమగ్నమై వున్నారు. వారి కొరకు వెండి, బంగారములను సమకూర్చుకున్నారు.

జెఫన్యా సందేశం : 

జెఫన్యా సందేశాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.

1. దేవుని తీర్పు 

ఎ) యూదా మీదకు రానున్న తీర్పు (1:1 - 2:6)

బి) అందరి మీదకు రానున్న తీర్పు (2:4 -3:13)

2. దేవుని వాగ్థానము (3:14 – 20)

దేవుని తీర్పు:

యెహోవా వాక్కు జెఫన్యాకు ప్రత్యక్షమయ్యింది . యూదా ప్రజలకు తాను ఎటువంటి కఠినమైన తీర్పును ఇవ్వబోతున్నాడో యెహోవా దేవుడు వివరించాడు – ఏమియు విడువకుండ సమస్తాన్ని ఊడ్చివేసెదను  (1:2) అని సెలవిచ్చాడు. భూమి మీద ఎవరును లేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను (1:3), బయలు దేవత యొక్క భక్తులను, ఆకాశ సమూహములకు మొక్కేవారిని (1:4), యెహోవా వద్ద విచారణ చేయనివారిని (1:5), అన్యదేసస్థుల వలె వస్త్రధారణ చేసుకునే వారిని (1:8), యజమాని ఇంటిని మోసముతోను, బలాత్కారముతోను నింపేవారిని (1:9) సమూలంగా నిర్మూలిస్తానని యుదా ప్రజలకు తన తీర్పును ప్రకటించాడు దేవుడైన యెహోవా.

కేవలము యూదా ప్రజల మీదనే కాకుండా అందరి మీదకు రానున్న తీర్పును జెఫన్యాకు తెలియజేయబడింది. గాజా, ఆష్కేలోను, అష్టోదు, ఎక్రోను మొదలగు ఫిలిష్తీయుల ప్రముఖ పట్టణాలను, మోయాబీయులను, అమ్మోనీయులను, కూషీయులను, అష్షూరీయుల దేశాన్ని మరియు వారి ముఖ్య పట్టణమైన నీనెవె ను నాశనం చేస్తానని అక్కడి అధిపతులు, ప్రవక్తలు, యాజకులు అందరూ నిర్మూలించబడతారని  యెహోవా సెలవిచ్చాడు.

దేవుని వాగ్థానము :

జెఫన్యా (3:14 -20) యెహోవా వాగ్దానం చేసిన ఉత్సవదినం గురించి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి మధ్య ఉంటాడు (1:15), యెహోవా వారిని అన్ని అపాయముల నుండి రక్షిస్తాడు(1:17), ఆయన వారి పట్ల సంతోషిస్తాడు,హర్షిస్తాడు, ప్రేమ కలిగి ఉంటాడు(1:18). యూదాలో మాత్రమే కాక సర్వలోకం లోనూ కుంటివారి పట్ల, చెదిరిపోయిన వారి పట్ల యెహోవా ఆసక్తి చూపుతాడు (1:19). దేవుని భవిష్యత్ పాలనకు ఇది ఒక సూచన. కుంటివారు, బహిష్కృతులు,పేదలు దేవుని రాజ్యంలో ఉంటారు.


దేవుని ప్రజలకు జెఫన్యా పిలుపు : 

1. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి  (1:7) : మౌనము ఒక్కోసారి మనము చేసిన తప్పును అంగీకరించడాన్ని సూచిస్తుంది. కాని దేవుని సన్నిధిలో మౌనముగా నుండుట ఆయన యందలి భక్తిని తెలియజేస్తుంది. దేవుడు తీర్పు తీర్చు దినము రావలసియున్నది నీతిమంతులు ఆ దినము కొరకు మౌనముగా ఎదురుచూడాలి.

2. యెహోవాను వెదకుడి (2:3) : మనము దేవుని సన్నిధిలో ఆయనను కలుసుకొనబోవుచున్నాము. రోమా(3:9-20) లో కుడా జెఫన్యా వివరించిన తీర్పును చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువు మన పాపము నిమిత్తమై మనకు బదులుగా ఆ తీర్పును పొందియున్నాడు. ఆయనను నమ్ముటవలన మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాము.

3. యెహోవా దినము కొరకు కనిపెట్టి యుండుడి (3:8) :  ప్రభువు దినము సమీపముగా ఉన్నది 2 పేతురు 3:12 లో కుడా ప్రభువు దినము కొరకు మనము కనిపెట్టవలసిన ఆవశ్యకతను తెలియజీస్తున్నది. పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించబడుచున్నాము.

4. జయధ్వని చేయుడి....పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి (3:14) :  జెఫన్యా తన ప్రవచనాన్ని ఆయన ప్రజలందరూ దేవుని ఆరాధించాలానే  పిలుపుతో ముగిస్తున్నాడు. రాబోయే దినములలో కాదుగాని ప్రస్తుతము ఉన్న స్థితిలోనే మనము దేవుని ఆరాధించేవారముగా ఉండాలి. ఎందుకనగా తీర్పుదినము తథ్యము. దేవుని  ప్రజలకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తప్పకుండా అందుతాయి. దేవుని ప్రజలు విశ్వాసముతో, వాగ్ధానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అని ఆయనను ఆరాధించాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా నీతిమంతుల భవిష్యత్తు ఆయందు భద్రపరచబడి యున్నది.

ముగింపు : 

జెఫన్యా  ప్రవచనం క్రీ.పూ 586 లో బబులోను వారు యెరూషలేమును నాశనం చేయుటతో నెరవేరింది. అయితే 3:18 – 20 లోని నిరీక్షణ సందేశం వాస్తవమవడానికి , బందీలుగా వెళ్ళిన  ప్రజలు తిరిగి వచ్చి దేవాలయాన్ని కట్టడానికి దాదాపు యాభై సంవత్సరాల పైనే పట్టింది. 

మనము జీవిస్తున్న ప్రస్తుత కాలాన్ని జెఫన్యా కాలానికి పోల్చి చూస్తే నాటి పాపాలే నేటి సమాజంలోనూ ఉన్నాయి. అనేక దేవుళ్ళను ఆరాధించడం, దేవుని యెడల నిర్లక్ష్యం, బలాత్కారము మరియు మోసము చేయడం, ధనాశ కలిగి ఉండడం మొదలగు వాటితో ప్రజలు నిమగ్నమైయున్నారు. దేవుని తీర్పు , ఉగ్రత దినాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన లేనివారుగా జీవిస్తున్నారు. చీకటిలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యపు వెలుగును ప్రకటించిన జెఫన్యా వంటి దేవుని సందేశాన్ని నిర్భయంగా ప్రకటించే వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రజలు ఆయన నిత్య రాజ్యపు ఆశీర్వాదాలను పొందుకోవాలని  కోరుకొంటున్నాడు.


No comments:

Post a Comment

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Kreestu Yokka Siluva

Visit Elselah Book House


Total Pageviews

25,146