నవంబర్ 10 , 1912వ సంవత్సరం పర్షియా (ప్రస్తుత ఇరాన్) లోని ఉర్మియా లో రెవ.ఛార్లెస్ క్లార్క్ స్టెరట్ మరియు సూజన్ నార్టన్ అనే అంకితభావం గల మిషనరీ దంపతులకు జన్మించాడు నార్టన్ స్టెరట్ . తమకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి రెవ.ఛార్లెస్ స్టెరట్ , అతని భార్య పర్షియా దేశానికి వెళ్లారు . 1900 నుండి 1916 వరకు వారు అక్కడ పరిచర్య చేశారు. వారికి నార్టన్ , ఎమిలీ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. తమ తల్లిదండ్రుల బలమైన ఆధ్యాత్మిక ప్రభావం నార్టన్ , ఎమిలీ జీవితాలలో చెరగని ముద్ర వేసింది. తరువాతి దినాలలో దేవుని పిలుపుకు ప్రతిస్పందించి నార్టన్ భారతదేశానికి , అతని సహోదరి తూర్పు ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్లారు.
బాల్యం మరియు విద్యాభ్యాసం :
నార్టన్ కు 4 సంవత్సరాల వయస్సులో అతని తల్లి అనారోగ్యం కారణంగా వారు పర్షియాను విడిచి అమెరికా దేశానికి వెళ్లారు. అమెరికా లోని అనేక రాష్ట్రాల్లో వారు పరిచర్య నిమిత్తం వున్నారు. కనుక అతని విద్యాభ్యాసం పలు ప్రదేశాలలో కొనసాగింది. నార్టన్‌ను, అతని తల్లి ప్రభువైన యేసు నొద్దకు నడిపించింది. దేవుని ప్రేమ గురించి ఆమె ఎప్పుడూ తన బిడ్డలకు వివరించేది. “ చిన్న పిల్లల వంటి విశ్వాసంతో నేను ఆయనలో నమ్మకముంచాను “ అని అంటారు నార్టన్. నార్టన్ కొలంబియా బైబిల్ కాలేజీలో బిఎ పూర్తి చేశారు. డల్లాస్ లోని డల్లాస్ థియాలాజికల్ సెమినరీ నుండి బ్యాచిలర్ ఆఫ్ థియాలాజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ మరియు 1947 లో డాక్టర్ ఆఫ్ థియాలజీ డిగ్రీలను పూర్తి చేశారు.
వివాహం మరియు కుటుంబం :
జూన్ 10, 1938 లో నార్టన్ మరియు ఎలోయిస్ ల వివాహం గ్రీన్‌విల్లె లోని రెండవ ప్రెస్బిటేరియన్ చర్చిలో ఎంతో నిరాడంబరంగా జరిగింది. వారిరువురు ఒక అద్భుతమైన బృందంగా ఏర్పడి , ఒకే విధమైన దర్శనము, భక్తి కలిగి అకుల, ప్రిస్కిల్లల వలె దేవునిరాజ్య వ్యాప్తిలో భాగస్వాములుగా కలిసి పనిచేశారు. ఎలోయిస్, నార్టన్ దంపతులు ఇద్దరు పిల్లలతో ఆశీర్వదింపబడ్డారు. వారి పేర్లు ఆనీ , జెర్రీ. వారిద్దరూ ఉత్తర భారతదేశంలోని కాన్పూర్ పట్టణంలో జన్మించారు. ఎలోయిస్ తన భర్త పరిచర్యకు గొప్ప సహాయకురాలు. ఆమె తెలివి కలిగి, ఆలోచన చెప్ప గల స్త్రీ. అనేక వ్యతిరేకభావములు ఉన్నప్పటికీ వారు యదార్ధంగా ఒకరినొకరు మెచ్చుకునేవారు.
నార్టన్ స్టెరట్ అభిరుచులు :
నార్టన్ ప్రధాన అభిరుచి చదవడం. పరిశోధన విద్యార్ధిగా అతడు అన్ని రకాల సాహిత్యాన్ని చదివేవారు. అతనికి సంగీతం అంటే కూడా ఎంతో మక్కువ. పియానో , ఆర్గన్ , ట్రంపెట్ మరియు అకార్డియన్ ను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. అంతేకాకుండా పర్యటించడం అంటే ఆసక్తి. ఆయన తన పరిచర్య దినాలలో భారత దేశమంతా విస్తృతంగా ప్రయాణించారు. ఆయన ప్రకృతిని ప్రేమించేవారు . ఆ ప్రేమ కారణంగా స్టెరట్ దంపతులు కోటగిరి లోని కొండ ప్రాంతంలో చక్కని గృహాన్ని తీసుకున్నారు. స్టెరట్ పాటలను రచించేవారు. సహవాసంలో ప్రేమను పెంపొందించడానికి “ Jesus commanded us something to do ” అనే పాటను రచించి, స్వరకల్పన చేశారు. స్టెరట్ ట్రంపెట్ పరిచర్య ఎంతో గొప్పది. ప్రతీ ఉదయం నూతన దినానికి స్వాగతం పలుకుతూ ఆయన వినిపించే ట్రంపెట్ సునాదం , హైఫీల్డ్ లోనేగాక చుట్టుప్రక్కల వారిని కూడా ఎంతో ఆహ్లాదపరిచేది. నార్టన్ షటిల్ , బాడ్మింటన్ మరియు వాలీబాల్ మొదలగు ఆటలను ఆడేవారు.
పరిచర్యకై సిద్ధపాటు :
మిషనరీ కావాలని నార్టన్ ఎన్నడూ ఆశించలేదు. 1929 వేసవిలో జరిగిన బైబిల్ కాన్ఫరెన్స్ లో ఒక మిషనరీ తన అనుభవాన్ని పంచుకుంటూ వుండగా నార్టన్ తో దేవుడు అతని పట్ల వున్న మిషనరీ ప్రణాళిక గురించి మాట్లాడగా, దేవుని పిలుపుకు విధేయత చూపాడు. తన భార్య అయిన ఎలోయిస్ తో కలిసి దక్షిణ అమెరికాకు వెళ్లాలని తలంచాడు. కాని దేవుడు వారి హృదయాలను భారతదేశం వైపు తిప్పాడు. భారతదేశాన్ని వారి కొరకు సిద్ధపరచినట్లు దేవుడు స్పష్టం చేశాడు. దేవుని పట్ల ప్రేమ , నశించిన వారి పట్ల శ్రద్ధ , వాడబడటానికి సంసిద్ధత అనేవి ప్రభువుని సేవించడానికి కావలసిన ప్రాధమిక అవసరాలు. “నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు “ (సామెతలు 8:17) లోని వాక్యం ద్వారా సవాలు చేయబడ్డాడు.
భారతదేశానికి ప్రయాణం:
1939 ఫిబ్రవరి లో కొలంబియా బైబిల్ కాలేజీలో స్నేహితులంతా స్టెరట్ దంపతులకు వీడ్కోలు చెప్పారు. ఆ సమయంలో వారు “ యేసు ఎన్నడూ ఓడిపోడు “ అనే స్మృతి చిహ్నాన్ని అక్కడివారికి ప్రదర్శించారు. ఆవిధంగానే భారతదేశంలో పరిచర్యలో వున్న 40 సంవత్సరాల కాలంలో వారు చేసిన పరిచర్యలో యేసు ఎన్నడూ ఓడిపోలేదు .1939 – 1948 మధ్యకాలంలో వారు ఉత్తర భారతదేశంలోని కాన్పూర్ లో ఉన్నారు. ఈ కాలంలో వారు హిందీ భాషను , భారత దేశ స్థితిగతుల్ని అధ్యయనం చేశారు, గ్రామాల్లో పరిచర్య చేశారు. నార్టన్ ఉర్దూ కూడా నేర్చుకున్నాడు. వారు గుడారాలలో నివసిస్తూ , కనీస అవసరాలతో తృప్తిగా జీవించేవారు. నార్టన్ మరియు ఎలోయిస్ IFES (ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజిలికల్ స్టూడెంట్స్ ) అనే సంస్థ తరుపున కొంతకాలం తాత్కాలిక మిషనరీలు గా పనిచేశారు. ఆ తర్వాత భారతదేశంలో విద్యార్థి సాక్ష్యాన్ని లేవనెత్తడానికి వచ్చిన పిలుపు , అక్కడ తెరిచి వున్న ద్వారాలకు స్పందించి తాము పనిచేస్తున్న కెనడియన్ ప్రెస్బిటేరియన్ మిషనరీ బోర్డుకు రాజీనామా చేసి IFES పూర్తికాల మిషనరీలు గా సమర్పించుకున్నారు.
నార్టన్ “ద గాడ్ ఆఫ్ క్రియేషన్ “ అనే విజ్ఞాన చిత్రంతో ఉత్తర, మధ్య భారతదేశంలో సుమారు 6,000 మైళ్ళు ప్రయాణించాడు. అది విజ్ఞాన చిత్రం కనుక అన్ని కళాశాలల్లో , పాఠశాలల్లో అనుమతి పొందగలిగేవారు . అనేక మంది యువ మనసుల్ని ఆకర్షించడానికి అది ఒక బలమైన మాధ్యమంగా ఉండేది.
స్వీయ క్రమశిక్షణ మరియు ప్రార్ధనా జీవితం :
నార్టన్ ప్రభువును ఎంతో ప్రేమించేవాడు. అనుదినం ఉదయాన్నే 4.30 కే లేచి బైబిల్ చదవడం , ప్రార్థన చేయడంతో తన రోజును ప్రారంభించేవాడు. క్రమమైన పద్ధతిలో ధ్యానం , ప్రార్థన , అధ్యయనాల అవసరాన్ని బోధించేవాడు. సమావేశం జరిగే సమయాలలో ఆయన మోకరించి శ్రోతల రక్షణ విషయమై ప్రార్ధించేవాడు . ఎలోయిస్ , నార్టన్ ఇద్దరూ ప్రార్ధనా అంశాలను , వాళ్ళ ఇబ్బందుల్ని , వత్తిడికి గురిచేసే విషయాలను సహవాసంలో పంచుకునేవారు. ఏ క్రైస్తవ సహవాసమైనా అభివృద్ధి చెందాలంటే పారదర్శకత , వినయం ప్రాముఖ్యమైన లక్షణాలని అర్ధం చేసుకున్నాడు నార్టన్ . ఆయన ప్రతి రోజుకు , ప్రతి వారానికి ఖచ్చితమైన ప్రణాళిక కలిగివుండేవాడు. శుక్రవారం రోజు మాత్రం తన కుటుంబంతో గడపటానికి సమయాన్ని కేటాయించేవారు. ఆయన ఆటలు ఆడే విషయంలోనూ, చేతివ్రాత విషయంలోనూ ఎంతో క్రమశిక్షణ కలిగివుండేవాడు. అన్ని విషయాలలో ఎంతో ముక్కుసూటిగా వ్యవహరించేవారు. టీంవర్క్ ను ఎంతో ప్రోత్సహించేవాడు . ప్రతీ వ్యక్తి లోని తలాంతులను గమనించి వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశాలను ఇచ్చేవాడు. ఆహార నియమాలలో భారతీయ విధానాన్ని అలవాటు చేసుకున్నాడు. తీవ్రమైన వేసవిలో కూడా ఆయన రెండవ తరగతి లోమాత్రమే ప్రయాణించేవాడు. స్నేహభావం, సర్దుకుపోయే తత్వం మరియు ప్రేమించడం వంటి ’ సేవక నాయకత్వపు ’ (Servant Leadership) లక్షణాలు ఆయనలో మెండుగా ఉండేవి. 1939-1976 వరకు స్టెరట్ దంపతులు భారతదేశంలో గడిపారు. పదవీవిరమణ అనంతరం ఆయన అమెరికా దేశానికి తిరిగి వెళ్ళిన తరువాత కూడా UESI గురించి ప్రజలకు తెలియజెప్పేవారు. ఈ పరిచర్య గురించి ప్రార్ధించేవారు .
UESI పరిచర్యలో నార్టన్ :
1949 లో కళాశాల విద్యార్ధుల కోసం ప్రొఫెసర్ ఇనాక్ మద్రాసు లోని తన ఇంటిలో దేవుని ఆత్మ ప్రేరేపణతో ఒక ప్రార్ధనా సమావేశాన్ని ప్రారంభించారు . అదే సమయంలో దేవుడు కోయంబత్తూర్ , వెల్లూరు ప్రాంతాలలో కూడా చిన్న గుంపులను లేవనెత్తాడు. వెల్లూరు లో జాన్ మూడీ , కోయంబత్తూర్ లో హెచ్.యస్.పొన్నురాజ్ మరియు డి.జయపాల్ ఈ విధమైన పరిచర్యకై చొరవ తీసుకున్నారు. అదే సమయంలో డాక్టర్ స్టెరట్ క్రైస్తవ నాయకుడైన బ్రదర్ భక్తసింగ్ ను అమెరికాలో జరిగిన అర్బానా కాన్ఫరెన్స్ లో కలిశారు. కళాశాల విద్యార్ధుల పట్ల తనకున్న భారాన్ని పంచుకున్నారు. బ్రదర్ భక్తసింగ్ భారతదేశానికి వచ్చి ప్రొఫెసర్ ఇనాక్ తో , ఝాన్సీలో నార్టన్ స్టెరట్ అనే వ్యక్తి విద్యార్థి పరిచర్యలో సహాయపడటానికి సంసిద్దంగా ఉన్నాడని , అతని సేవల్ని వినియోగించుకోమని ప్రోత్సహించారు. ప్రొఫెసర్ ఇనాక్ ఎంతో ప్రార్ధించి , తీవ్రంగా ఆలోచించిన తరువాత ఆయన మద్రాసు ఇయు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడటానికి డాక్టర్ స్టెరట్ ను ఆహ్వానించారు. ప్రొఫెసర్ ఇనాక్ , స్టెరట్ ను నగరంలోని అనేక కళాశాలలకు తీసుకెళ్ళారు. అక్కడ్ స్టెరట్ తన చిత్రాలను ప్రదర్శించారు. వాటి ద్వారా విద్యార్ధుల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. చురుకైన విద్యార్ధుల్ని గుర్తించి ప్రొఫెసర్ ఇనాక్ గృహములో జరిగే ప్రార్ధనా సమావేశానికి హాజరవ్వమని ప్రోత్సహించారు. ఏ విదేశీ సంస్థతో పరిచర్యను జతచేయడం ఇష్టం లేక , స్టెరట్ ను పరిచర్యలోనికి తీసుకోడానికి మొదట విమిఖత చూపారు ప్రొఫెసర్ ఇనాక్. రెండు సంవత్సరాల అనంతరం 1950 లో స్టెరట్ దంపతులు మద్రాస్ కు వచ్చారు. ఆ సమయంలో డేవిడ్ వాట్సన్ కూడా పరిచర్యలో సహాయపడుతుండేవారు. పరిచర్య విస్తరించడం ప్రారంభమయ్యింది. 1954 లో UESI ఏర్పడింది. అప్పటి నుండి 1975 వరకు స్టెరట్ దంపతులు UESI పరిచర్యలో కొనసాగారు. 36 ఏళ్ల సుదీర్ఘ పరిచర్య తరువాత భారతదేశానికి వీడ్కోలు చెప్పి వారు స్వదేశానికి తిరిగి వెళ్లారు.
హైఫీల్డ్ :
హైఫీల్డ్ , UESI స్టడీ సెంటర్ . ఇది నీలగిరి కొండల మధ్య కోటగిరి అనే స్థలంలో వుంది. స్టెరట్ దంపతులు ఈ సెంటర్ ను UESI కు బహుమతిగా ఇచ్చారు. “ఈ స్థలములో నా సమాధానముండును “ హగ్గయి 2:9 – వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ వాగ్ధానము ద్వారా ఎందరో విద్యార్ధులు , గ్రాడ్యుయేట్లు మరియు స్టాఫ్ వర్కర్లు ఆత్మీయమైన సమాధానమును అనుభవించి దేవునికి సమీపంగా వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని స్టెరట్ దంపతులు ఆత్మీయ తల్లిదండ్రుల వలె ఎంతో ప్రేమగా చూసుకునేవారు.
నార్టన్ స్టెరట్ మరణం :
స్టెరట్ దంపతులు న్యూయార్క్ పట్టణానికి కొద్దిగా ఉత్తరభాగాన ఉన్న ‘ హడ్సన్ హౌస్ ‘ అనే ఐవిసిఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో రెండున్నర సంవత్సరాలు గడిపారు. 1978, ఫిబ్రవరి 6 న నార్టన్ స్టెరట్ నడుస్తూనే తూలిపోవడాన్ని గమనించిన ఎలోయిస్ వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్ళింది . ఆ రాత్రి నార్టన్ కోమా లోకి వెళ్ళిపోయారు . ఆయనకు బాసిలర్ ఆర్టరి థ్రాంబాసిస్ అనే వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు . ఫిబ్రవరి 9 న ఆయన పరలోక పిలుపును అందుకొని ప్రభువు సన్నిధిని చేరారు.
“ నార్టన్ తన మనస్సులో ఎన్నడూ భారత దేశాన్ని విడిచిపెట్టలేదు “ , నార్టన్ మరణించిన 10 రోజుల తరువాత ఎలోయిస్ తన స్నేహితులతో పలికిన మాటలివి .
ముగింపు :
స్టెరట్ దంపతులు సామన్య జీవితము , ఉన్నతమైన భావాలు కలిగి ఉండడం ద్వారా ముందు తరాలను ఎంతో ప్రభావితం చేశారు. హైఫీల్డ్ వారి నిస్వార్ధ ప్రేమకు సాక్ష్యంగా నేటికీ వారి జ్ఞాపకార్ధంగా నిలిచివుంది. హైఫీల్డ్ లోని లైబ్రరీని , వెలకట్టలేని సంపదను UESI కు బహుమానంగా ఇచ్చారు. వారు ఏక మనస్సుతో చేసిన సేవ , అనేకమంది జీవితాలలో ఖర్చు చేసిన వారి భక్తి , విశ్వాసాలు మరియు వారి పుస్తకం ‘ HOW TO UNDERSTAND YOUR BIBLE ’ ఎందరికో ఆశీర్వాదకరంగా వున్నాయి.
డాక్టర్ స్టెరట్ గారి జీవిత సారాంశాన్ని ఇలా చెప్పవచ్చు – క్రమశిక్షణ , లోతైన తగ్గింపు స్వభావము , తనను తాను సమర్పించుకొని కష్టించి పనిచేయడము , తండ్రి వంటి దయాస్వభావము , సమృద్ధి కలిగిన మరియు షరతులు లేని దాతృత్వము, భక్తి గల సాధుగుణము . UESI ఆత్మీయ తండ్రిగా ఆయన భారతదేశ విద్యార్ధులు , గ్రాడ్యుయేట్లు మరియు స్టాఫ్ వర్కర్ల హృదయాలలో ఎప్పటికీ నిలిచివుంటారు.
( డాక్టర్ స్టెరట్ గారి జీవిత వివరాలను మరింత విపులంగా తెలిసికొనుటకు UESI పబ్లికేషన్ ట్రస్ట్ వారు 1999 లో ప్రచురించిన ‘ YOU REALLY LOVED US ‘ , IVP వారు ప్రచురించిన ‘ TALE OF A LEGEND ‘ మరియు ప్రత్యేకంగా తెలుగు పాఠకుల నిమిత్తమై UESI-AP వారు ప్రచురించిన ‘భారతీయ విద్యార్ధులను క్రీస్తు కొరకు మలచిన శిల్పి – డాక్టర్.టి.యన్. స్టెరట్ ‘ అను పుస్తకాలను చదవగలరు)

No comments:
Post a Comment