డాక్టర్ ఐరిస్ పాల్
మన్యంలో వెలుగు - భారతీయ వైద్య మిషనరీ
మన్యంలో వెలుగు - భారతీయ వైద్య మిషనరీ
“వైద్యము చేయుట నా జీవితము - నా పని ముగించేవరకు చేస్తూనే ఉంటాను”
అది ఒరిస్సా రాష్ట్రం, మల్కనగిరి జిల్లాలోని మన్య ప్రాంతం. అక్కడ బోండో జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. వారు ఆదివాసీలు. తమ శత్రువులను వాడియైన బాణాలతో ఏ సంకోచమూ లేకుండా చంపేయగలరు. వారి తెగలోనూ అనేక మంది పురుషులు చంపబడ్డారు. వారి తెగలో స్త్రీ , పురుషులు కలిసి సారాయిని సేవిస్తారు. శిశువు పుట్టగానే వాని నాలుక మీద ఒక సారాయి చుక్కను వేయడం వారి ఆచారం. వారి ఆచారాలలో కొన్ని మంచివి మరికొన్ని మూఢమైనవి, అతీత శక్తులతో కూడినవి ఉంటాయి.
డాక్టర్ ఐరిస్ గ్రేస్ రాజకుమారి మరియు ఆమె భర్త డాక్టర్ పాల్‌ల వివాహం 25 జనవరి 1972 న జరిగింది. తరువాత అక్టోబరు 1977 వ సంవత్సరంలో ఆ మన్య ప్రదేశానికి ఐఇయం మిషన్ తరుపున వైద్య పరిచర్య నిమిత్తమై పంపబడ్డారు. 36 ఏళ్ళ ప్రాయంలో వున్న డాక్టర్ పాల్ అనతికాలంలోనే తీవ అస్వస్థతకు లోనై సి.యం.సి, వెల్లూరు ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఆయన కిడ్నీ ఒకటి పూర్తిగా చెడిపోయిందని వైద్యులు తెలిపారు. ఆయన అనారోగ్యం నుండి కోలుకున్న పిమ్మట మరల బోండో ప్రజల మధ్యకు వెళ్ళారు. ఐరిస్ అక్కడ రోడ్డు ప్రక్కనే తన క్లినిక్‌ను ప్రారంభించింది. పాల్ గాయాలు కట్టుటలో,రోగులతో మాట్లాడుటలో సహాయం చేసేవారు. ఆ ప్రాంతములోని కొందరు కోయ తెగవారు దేవుని తెలుసుకొని క్రైస్తవులయ్యారు. 1986 లో డాక్టర్ పాల్ మరల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సెప్టంబర్ 30 వ తారీఖున ఆపరేషన్ జరిగినప్పటికి, అది విఫలమై ప్రభువు చెంతకు కొనిపోబడ్డారు. డాక్టర్ ఐరిస్ పాల్ ఎంతో వేదనకు గురి అయినప్పటికి తన భర్త విడిచిన పరిచర్యను తిరిగి కొనసాగించుటకు పూనుకున్నారు. ఆమె రీచింగ్ హాండ్ సొసైటీని 1993లో స్థాపించి తమ కార్యక్రమాలను ఆ ప్రాంతంలో విస్తరించారు.
డాక్టర్ ఐరిస్ గ్రేస్ రాజకుమారి 1945 వ సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. నలుగురు పిల్లలలో పెద్దదానిగా, ఒక గౌరవప్రదమైన, సకల సౌకర్యాలు కలిగిన ఒక ఉన్నత, భక్తి గల కుటుంబంలో పెరిగారు. ఆమె తండ్రి తమిళనాడు గవర్నమెంట్ లో చీఫ్ ఇంజనీరుగా పనిచేసేవారు. వారు దేశంలోని అనేక ప్రాంతాలలో నివసించుటచే ఐరిస్ హిందీ భాషను కూడా అనర్గళంగా మాట్లాడగలిగేది. చిన్నపిల్లగా వున్నపుడు ఎంతో చురుకుగా, అల్లరిగా, పొగరుగా వుండి తల్లిదండ్రుల ఆశలకు వ్యతిరేకంగా నడచుకునేది. కాని చదువుల్లో మాత్రం ఎంతో చురుకుగా వుండేది. ఆమె చెన్నై లోని మహిళా క్రిస్టియన్ కళాశాలలో బి.యస్‌సి, జువాలజీ విభాగంలో అత్యున్నత ప్రతిభను కనపరిచింది. ఆ తరువాత ఫాతిమా కాలేజీ, మధురై మెడికల్ కళాశాల మరియు కిల్‌పాక్ మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.యస్ పీడియాట్రిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
ఆమె తన 13వ ఏటనే తన స్కూల్ టీచర్ యేసు ప్రభువును స్నేహితునిగా చేసుకోవాలని కౌన్సిల్ చేసినపుడు తన హృదయాన్ని దేవునికి సమర్పించింది. తన తల్లి యొక్క ప్రార్ధనా జీవితం ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు UESI వారితో కలిసి విద్యార్ధి పరిచర్యలో పాల్గొన్నారు. ఆమె తన స్నేహితులను అక్కడ జరిగే ఇయు (ఇవాంజిలికల్ యూనియన్) క్యాంప్స్ మరియు రిట్రీట్స్‌కి ఆహ్వానించెడివారు. అంతేకాకుండా ఇమ్మాన్యుయేల్ మెథడిస్ట్ చర్చి సభ్యురాలిగా క్వయిర్లో పాల్గొనేవారు. ఒక యవ్వనస్తుల కూడికలో డాక్టర్ శాం కమలేశన్ గారు యవ్వనస్తులను మురికివాడలలో పరిచర్యకు వాలంటీరుగా సేవచేయుటకు ఇచ్చిన సవాలుకు ప్రతిస్పందించి వాలంటీరుగా పరిచర్యలో తన సేవలను అందించారు. ఎం.బి.బి.యస్ పూర్తి చేసిన పిమ్మట, ఆఫ్రికా దేశములో మిషనరీగా సేవలందించిన Albert Schwetzer జీవితమును చదువుట ద్వారా ఇండియా దేశములో అట్టడుగున పేదరికములో ఉన్న అనేకులకు తన సేవలను అందించాలని పురికొల్పబడ్డారు.
వివాహానికి పూర్వము డాక్టర్ పాల్ గారి మిషనరీ పరిచర్యను గురించి ఐరిస్ విని అతని సేవల పట్ల ఆకర్షితురాలయ్యారు. వారు వివాహానంతరము మొదట ఇండియన్ మిషనరీ సొసైటీ ద్వారా తమ సేవలను అందించాలని దేవుని పిలుపును పొంది ఒరిస్సాలోని మల్కనగిరి ప్రాంతంలో ప్రారంభించారు. ఇక్కడి ఆదివాసీ తెగలలో సాధరణంగా కనిపించే మలేరియా, ట్యుబర్‌క్లోసిస్, డిసెంట్రీ, చర్మ వ్యాధులు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రసవము చేయుటలో సహాయపడ్డారు. తరువాత బోండో తెగల మధ్య పని చేయ సంకల్పించారు. వారు అక్కడ జరిగే స్థానిక మార్కెట్టు లేదా సంతలలో రోడ్డు ప్రక్కన క్లినిక్ నడుపుట ద్వారా వారితో పరిచయాలు పెంచుకున్నారు. వారికి నూతన నాగరిక పద్ధతులను వారి భాషలోనే తెలియజేసేవారు. అక్కడి స్త్రీల కొరకై ఒక ప్రత్యేక 'ఉమెన్స్ హెల్త్ కేర్'ను ఆరంభించారు.
డాక్టర్ పాల్ గారి మరణానంతరం డాక్టర్ ఐరిస్ మరల మల్కనగిరి ప్రాంతానికి వచ్చి తమ మిషనరీ పరిచర్యకు పునరంకితమయ్యారు. ఎఫికార్(Evangelical Fellowship of India Commission on Relief) అనే సంస్థతో కలిసి అక్కడి వారికి అనేక విద్యాకార్యక్రమాలను రూపొందించి వారి అక్షరాస్యతను పెంచుటలో ఎనలేని కృషి చేశారు. సెయింట్ స్టీఫెన్స్ చర్చిని మల్కనగిరిలో నిర్మించి అనేక సంఘాలను ఇండియన్ మిషనరీ సొసైటీలో చేర్చారు. తరువాత సెయింట్ లూక్స్ వైద్యశాలను కూడా అక్కడే స్థాపించారు.
బొండో జాతి ప్రజలు అనేకులు చెరసాలలో వుండుటచే వారిని సంస్కరించుటకుగాను అనేక సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. వారికి పాటలు, ఆటలు, టెలివిజన్ ద్వారా, బైబిల్ గ్రూపుల ద్వారా, సంఘ ఆరాధనల ద్వారా మరియు కూరగాయలను సాగు చేయుట ద్వారా వారిని చైతన్య పరిచారు. EFICOR సంస్థ సహాయముతో వారిని చెరసాల నుండి విడుదల చేయుటకు కావలసిన మెళుకువలను తెలుసుకొని వారిని విడిపించి, ఉద్యోగ అవకాశాలను కల్పించుటలో తోడ్పడ్డారు. మల్కనగిరి ప్రాంతంలో రెండు సంవత్సరాలలో గొట్టేన్ పల్లి నీటి డ్యామ్ ను నిర్మించుటలో తోడ్పడినారు. 300 బావులను త్రవ్వించి పంపుల ద్వారా నీటి సరఫరా అయ్యేటట్లు చేశారు. అనేక గ్రామాలలో వేల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేసారు. బోండోల యొక్క సాంఘిక, ఆర్ధిక స్థితిగతులలో మార్పు తేవడానికి అవిరళంగా కృషి చేసారు. డాక్టర్ ఐరిస్ అనేక యవ్వన భారత దేశ మిషనరీలకు ఆదర్శంగా నిలిచారు. పలు జాతీయ, అంతర్జాతీయ కాన్‌ఫరెన్స్‌లలో ఉపన్యసించి వారికి మార్గదర్శకం చేసారు.
రీచింగ్ హాండ్ సొసైటీ ద్వారా మల్కనగిరి ప్రాంతంలో 926 గ్రామాలకుగాను 700 గ్రామాలను చేరగలిగారు. 120 గ్రామాలలో అక్షరాస్యతను పెంచగలిగారు. 50 గ్రామాలు మరియు చెరసాలలలో ఆరాధనా స్థలాలను నెలకొల్పారు. 2004వ సంవత్సరములో సంస్థ యొక్క ఎక్సిక్యూటివ్ సెక్రటరీ పదవి నుండి ఆమె విరమణ తీసుకున్నారు. ప్రస్తుతము ఆమె కుమారుడు బ్రదర్ రెమో పాల్ ఆ సంస్థకు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్‌గా మరియు కోడలు డాక్టర్ సూసన్ పాల్ మెడికల్ సూపరెండెంట్‌గా తమ సేవలను కొనసాగిస్తున్నారు .
డాక్టర్ ఐరిస్ తన పరిచర్యలో అనేక అవార్డులను అందుకున్నారు. 1988లో ‘యోక్ ఫెలో’ అవార్డును ‘డైరెక్ట్ మిషన్ ఎయిడ్ సొసైటీ’ వారిచే మరియు 1996లో ‘రాబర్ట్ పియర్స్’ ఇంటర్నేషనల్ అవార్డును ‘వరల్డ్ విజన్’ సంస్థ వారిచే పొందారు.
"వైద్యము చేయుట నా జీవితము, దానిని నేను ఒక పనిలా భావించను. అది తప్ప వేరొక పని చేయాలని నేను ఎప్పుడూ ఆలోచించను. ప్రజలు వైద్యము నిమిత్తము అదనపు సమయాల్లో వచ్చినా నేను కాదనను. నా పనిని ముగించేవరకు నేను చేస్తూనే వుంటాను." - అని పలికే డాక్టర్ ఐరిస్ పాల్ జీవితం, మన సంఘాన్నిసమాజాన్ని దేవుని కోసం గెలవాలనే దర్శనం కలిగి పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండును గాక!
(డాక్టర్ ఆర్.ఎ.సి.పాల్ మరియు డాక్టర్ ఐరిస్ పాల్ యొక్క మిషనరీ పరిచర్యను గురించి 1998వ సంవత్సరంలో బ్యూలా వుడ్ మరియు లలిత చెల్లప్ప గార్లు రచించిన 'పయనీరింగ్ ఆన్ ద పిండ" అను పుస్తకాన్ని 'ఇండియన్ లిటరేచర్ సర్వీస్ ' వారు ముద్రించారు. ఆసక్తి గలవారు ఆ పుస్తకం ద్వారా వారి పరిచర్యను గూర్చిన మరెన్నో విషయాలను తెలిసికొనగలరు.)
No comments:
Post a Comment